Varanasi tour -కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్రా విశేషాలు (12-3-20 to 23-3-20)
Kasi,
Prayag & Ayodhya tour -కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్రా విశేషాలు (12-3-20 to
23-3-20)
వారణాసి
వెళ్లాలని ఎప్పుడూ కోరిక కలగలేదు. ఎందుకో తెలియదు మరి. బహుశా కాశీ వెళ్ళిన ఒకామె కాశీ
అంతా బురద బురదగా ఉంటుంది. కోవెల కు వెళ్ళే త్రోవలో అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు.
త్రోవంతా ఆవులు వుంటాయి. వాటి పేడ ఉంటుంది. అని వినడం కారణం కావొచ్చు. మరొకరు ఏమన్నారంటే,
ఇవన్నీ ఉన్నా, మరల కాశీ వెల్లాలనిపిస్తుంది అని.
శివుడు నాకెప్పుడూ అవకాశం ఇస్తాడా అని మాత్రం ఎదురు చూసాను. ఆ అవకాశం రానే వచ్చింది మా వారి రూపంలో & డా. హనుమంత రావు గారి రూపం లో. మా వారికి కాశీ వెళ్లి తొమ్మిది రాత్రులు అక్కడ ఉండాలని కోరిక. మేము భువనేశ్వర్ మీదుగా కాశీ చేరుకున్నాం. వర్షం పడుతుంది. అందుకు రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది.
Hotel Gateway
Kailas లో దిగాం.
మేమున్న హోటల్ ఎదురుగా గేట్ నెంబర్ 1 (ఆది
శంకరాచార్య గేట్) . అక్కడనుండి 100-150m
దూరం ఉంటుందేమో విశ్వనాథుని కోవెల.
కాశీ విశ్వనాథుని దర్శనం అంటే మాటలా! మనం అనుకుంటే చాలదు. శివుని
ఆజ్ఞ కావాలి అంటారు. ప్రతి హిందువూ చనిపోయేలోగా
ఒక్కసారైనా కాశీ యాత్ర చేయాలనుకుంటారు. అటువంటిది
కాశీ వచ్చి దర్శనానికి వెళుతున్నామంటే మనసంతా ,అబ్బ! కాశీ వచ్చేశాము. విశ్వనాథుని చూడ
బోతున్నాను అని ఒకటే ఉత్సాహం. దర్శనానికి చెప్పులు లేకుండానే బయలుదేరాం. ట్రోవం
తా బురద, బురద. మనుషులు జాగ్రత్తగా
నడవక పోతే ఒకరి నొకరు గుద్దు కోవలసిందే. ఇవేవీ నా ఆతృతని, ఉత్సాహాన్ని ఆపలేదు. ఒక గంట
క్యూలో వెయిట్ చేశాక విశ్వనాథుని దర్శనం అయింది.
శివలింగం
ఉండే గర్భగుడి చతురస్రాకారంగా, చిన్నగానే ఉంటుంది.
మరీ మధ్యలో కాకుండా ఒక పక్కగా, కొద్దిగా క్రిందకు వెండి పానిపట్టం, అందులో సుమారుగా
రెండు అడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది. నాలుగు దిక్కులా ద్వారాలు ఉన్నాయి. రెండు ద్వారాల
నుండి ప్రవేశం ఉంటుంది. మిగిలిన రెండు ద్వారాల గుండా బయటకు వస్తాం. శివ లింగం దగ్గరగా
వెళతాం. శివ లింగం చుట్టూ బారికేడ్స్ ఉన్నాయి.
అభిషేకం చేసుకోవచ్చు. గుడి వెలుపల పాలు అమ్ముతారు. మనను శివలింగాన్ని ముట్టుకోనివ్వరు.
కాని రాత్రి 6-7pm వరకూ చరణ స్పర్శ అంటే
మనం శివలింగాన్ని తాకవచ్చు. రెండో రోజు మేము చరణ స్పర్శకు వెళ్ళాము. నాకేమనిపించిందంటే,
కొంతమంది శివలింగాన్ని చేతులతో రుద్దినట్లు చేసేస్తున్నారు. మరి స్వామికి నొప్పి కలుగుతుందేమో
అనిపించింది. నేను కూడా స్పర్శించాను కదా! మరి నేను కూడా స్వామిని ఇబ్బంది పెట్టానా
అనుకున్నాను.
పరమపావన
గంగలో స్నానం చేసి, విశ్వనాధుని దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.
కాశీ వచ్చాక గంగానదిలో స్నానం చేసి, గంగా నదీ జలాన్ని తీసుకు వెళ్ళి రామేశ్వరంలో పూజ
చేసి, అక్కడ ఇసుక తెచ్చి ఇక్కడ గంగలో కలుపుతారు.
ఇది హిందువుల నమ్మకం. అలాగే కాశీలో మనకు అత్యంత ప్రీతిదాయకమైనది విడిచి పెట్టాలట.
విశ్వనాధుని
మందిరం లోపలే అన్నపూర్ణాదేవి మందిరం, పార్వతి మాత మందిరం ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు
రాధాకృష్ట్నుల మందిరం ఉంది. పెద్దది వినాయకుని విగ్రహం ఉంటుంది.
ఉత్తరాన
ఒక నుయ్యి ఉంది. జ్ఞాన బావి అంటారు. ముస్లింల
దండయాత్ర సమయంలో ప్రధాన పూజారి శివలింగాన్ని పట్టుకుని ఈ బావిలో దూకేసాడట, వాళ్ళకు
శివలింగం దొరకకుండా. ఆ పక్కనే పెద్ద నంది
ఉంటుంది. ఆ పక్కనే చిన్న సభా మంటపం ఉంది.
కచేరీలు జరుగుతాయి.
అంతా
ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మనలను పూర్తిగా చెక్ చేసి లోపలకు పంపిస్తారు.
ఆలయం
దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల్లాగ పెద్ద ఎత్తున కళాత్మకంగా గాని,శిల్పపరంగాగాని భాసిల్లదు.
చుట్టూ కూడా పెద్ద విశాలంగా లేదు. ఆలయ శిఖరం బంగారంతో చేసిఉంటుంది. అటూ, ఇటూ రెండు
గోపురాలు ఉంటాయి. మనం దూరం నుండి కూడా, శిఖరాన్ని కూడా ఫోటో తీయకూడదు. పారా మిలటరీ
ఫోర్స్ అడుగడుగునా ఉంటారు. 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే
మసీదు ఉంది. దీని కుండా అదే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది వాడుకలో ఉందో లేదో తెలియదు.
దర్శనం
అయ్యాక బయటకు వచ్చి, అన్నపూర్ణాదేవి టెంపుల్ కు వెళ్ళే దారిలో ఢుండి గణపతి మందిరం ఉంటుంది. అతనికి మనం వచ్చామని
చెప్పాలట. మాఘ శుద్ధ చవితి రోజు ఢుండి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు.
మనం విశ్వనాధ్ ఆలయానికి వెళ్ళే త్రోవలో షాపుల మధ్య సాక్షి గణపతి మందిరం ఉంటుంది.
అన్నపూర్ణాదేవి ఆలయం: కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం, దేవాలయం వారిచే నిర్వహించ బడుచున్నది. ఈ అన్నపూర్ణమ్మ తల్లి అలంకారంలో చాలా ముద్దుగా ఉంటారు. ఆ కళ్ళు చిన్న పిల్లల కళ్ళలా అమాయకంగా అగుపిస్తూ...భలే ఉన్నారు. ఈ మందిరంలో ఎంట్రన్స్ లోనే శివలింగం ఉంటుంది. మెట్లు దిగి కొంచెం క్రిందకు వెళ్ళాల్సి ఉంటుంది.
ఒక పక్కగా సూర్యదేముడు, కొంచెం లోపలకు కాళీమాత, జగన్నాధ, సుభద్ర, బలభద్ర మందిరాలు ఉన్నాయి. కాని ఇక్కడ అంతా డబ్బు మహిమ. ఒక వంద ఇస్తే లోపలకు పోనిస్తారు. టికెట్ కాదు. చేతికి ఒక దారం కడతారు ఓ వంద వసూలు చేస్తారు. ఇక్కడ భోజనం సుష్టుగా పెడతారు. కాని వేస్టేజ్ ఎక్కువ. అన్నదానానికి కొంత డబ్బు కట్టాం.
విశాలాక్షిమందిరం
కాశీ విశ్వనాధ ఆలయానికి కొద్ది దూరంలో, సందులు తిరుగుతూ వెళితే, విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం. ఇది 17వ శక్తి పీఠం. ఇక్కడ అమ్మవారి చెవిపోగు పడిందట. కాని ఇక్కడ పూజారులు అమ్మవారి ముఖం పడిందని అంటారు. ఆ ముఖం స్వయంభువుగా వెలసింది అంటారు.ఈ విగ్రహం ముందు ఇంకొక విగ్రహం ఉంటుంది. అది ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్టింప బడిందట. ఇలాగ రెండు విగ్రహాలు ఎందుకు ఉన్నాయి అంటే వెనుక స్వయంభువు విగ్రహానికి చిన్న లోపం, వేళ్ళలో ఉందట. అందుకని ఇంకొకటి ప్రతిష్టించారు.
ఈ ఆలయం ఇళ్ళ మధ్యలో, సందుల మధ్య, మణికర్ణికా ఘాట్ కు దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయంలోపల శివుని మందిరం, నవగ్రహాలు ఉన్నాయి.
కాశీనగరం శివ స్థాపితం అని పురాణాల విశ్వాసం. ప్రళయ కాలంలో కూడా నీటిలో మునగని ప్రదేశం ఇదొక్కటే అని హిందువుల విశ్వాసం. అలాగే సప్త ముక్తి పురాలలో ఇది ఒకటి. ( మధుర, గయ, ద్వారక, అయోధ్య, అవంతిక, కంచి మిగిలినవి.) అలాగే ప్రపంచంలో అతి పురాతన నివాస నగరాలలో ఇది ఒకటి. కాశీ నగరం ఆధ్యాత్మికంగా, (ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ విశాలాక్షి అమ్మవారు ఒకరు.) పారిశ్రామికంగా, (బెనారస్ పట్టు వస్త్రాలు) విద్యాపరంగా, (బెనారస్ హిందూ యూనివర్సిటీ) ఎంతో ప్రాముఖ్యత కలిగినది.
వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడ గంగా నదిలో కలుస్తాయి. అందుకే వారణాసి అయిందంటారు. అసలు కాశీ రెండుగా విభజింప బడింది. విష్ణుకాశీ మణికర్ణిక ఘాట్ నుండి ఆది కేశవ ఘాట్ వరకు, శివకాశీ మణికర్ణిక ఘాట్ నుండి. అస్సి ఘాట్ వరకు.
హిందువులకు పరమ పవిత్రమైన నది గంగా నది. ఆ నదీ తీరంలో సుమారు 84 ఘాట్లు ఉంటాయి. అందులో దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదారేశ్వర ఘాట్, పంచ గంగ ఘాట్ లు ముఖ్యమైనవి. దహన సంస్కారాలు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ లలో జరుగుతాయి. ఎక్కువ జన సమ్మర్థమైనది దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మ పది అశ్వమేథ యాగాలు ఇక్కడ చేయబట్టి దానికి ఆ పేరు.
సారనాథ్
నుండి ఈ నగరం బౌద్ధులకు
కూడా ముఖ్యమైనది. 23వ జైన తీర్ధంకరుడైన
పార్శ్వ
నాధుని
జన్మ
స్థలం
ఇదే. అందుకు జైనులకు కూడా ముఖ్యమైనది.
గంగా నది కాలుష్యం గురించి ఎంతో వినిఉన్నాం. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శుభ్రంగానే ఉంది. ఘాట్లు కూడా శుభ్రంగా ఉంచుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేదు. ఇంత ప్రాముఖ్యత కలిగిన కాశీలో పారిశుధ్య పనులను మెరుగు పరచి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక్కడకు వచ్చిన యాత్రీకుల్లో ఎక్కువమంది మన తెలుగు వాళ్ళే.
కాల భైరవుడు, బిందు మాధవులను దర్శించ కుండా కాశీ పర్యటన పూర్తి కాదు.
గంగా హారతి
ఎంతో ప్రసిద్ధి పొందింది. మన ప్రధాన మంత్రి గారు కూడా గంగా హారతిని తిలకించారంటేనే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. సాయంకాలం 4.30 నుండి అందరూ దశాశ్వమేధ ఘాట్ కు చేరుకుంటారు. ముందు వెళ్ళే వాళ్ళు చక్కగా ముందు కూచుని చూడవచ్చు. విదేశీయులు కూడా చాలా మంది వస్తారు. కుర్చీలు వేసి ఉంటాయి. అరుగుల మీద కంబళ్ళు పరుస్తారు కూచోడానికి. నదివేపు ఉన్న అరుగుల మీద పూలరేకులు చల్లి ఉంచారు. అక్కడకు అందంగా ముస్తాబైన వేదాధ్యయనం చేస్తున్న వారిలా ఉన్నారు. వచ్చి కూచొని హారతి ఇస్తారు. ఒక వేపు నుండి మ్యూజిక్ వినిపిస్తుంటుంది. పాట వినిపిస్తుంటుంది. హారతి, ముందు ఊదొత్తులతో, తరువాత ధూపం, దీపాలు, వింజామరతో సేవ చేస్తూ ఇస్తారు. అందరూ ఒకేసారి క్రమ పద్ధతిలో ఇస్తుంటే చాలా, చాలా బాగుంటుంది. ఇది చూడడానికి కొంత మంది ఒడ్డున కూచుంటే, కొంతమంది, పడవల మీద నుండి చూస్తారు. లక్కీగా మేము కాశీ వెళ్ళీన రోజే చూడడానికి వెళ్ళాం. మరల రేపు వెళ్దామనుకుంటే, కరోనా నుండి గంగా హారతి ఆపేశారు.
One day Local Site Seeing
places
వారాహీ మాత: లలితా దేవి సర్వ సేనాని. కాశీ పట్టణ రక్షణ బాధ్యత వారాహీ మాతది. అందుకని ఆమె రాత్రంతా తన బాధ్యత ను నిర్వహించి వేకువ అవుతుండగా, తన మందిరాన్ని చేరుకుని, పగటి పూట విశ్రాంతి తీసుకుంటారు. అందుకని ఆమె దర్శన వేళలు ఉదయం 10-11am తో ఆపుతారు. ఉదయం ఆమెకు పూజ చేసి 7am కు మందిరం తలుపులు తెరిచి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వారాహీ అమ్మ అండర్ గ్రవుండ్ లో ఉంటారు. మనం ఒక కిటికీ ద్వారా ఆమెను చూడవచ్చు. కానీ పూర్తిగా ఆమె ముఖం మనకు కనిపించదు. అలంకారం అడ్డేస్తుంది. ఇంకొక కిటికీ సరిగ్గా ఆమె ముందు ఉన్నట్లుంటుంది. అక్కడ నుండి ఆమె పాదాలు మాత్రం కనిపిస్తాయి. ఈ ఆలయం దశాశ్వమేధ ఘాట్ కి దగ్గరలో ఉంటుంది. ఇళ్ళ మధ్య సందులో ఉంటుంది.
నేపాల్ టెంపుల్: ఇది పశుపతి నాథ్ టెంపుల్ కు ప్రతిరూపం. నేపాలీల క్రింద ఉంటుంది. మేము వెళ్ళిన రోజు కరోనా నుండి మూసి ఉంది. ఎంత రిక్వెస్ట్ చేసినా తలుపులు తీయలేదు.
రాజరాజేశ్వరీ టెంపుల్: ఇది నేపాల్ టెంపుల్ కు దగ్గరలో ఉంటుంది. సందులు తిరుగుతూ పోవాలి. అమ్మవారి విగ్రహం అందంగా. అలంకరించి ఉంది.
త్రిలింగ స్వామి టెంపుల్: ఇతను విజయనగరం లో 1607 నవంబర్ 27 న పుట్టారట. 280 సంవత్సరాలు బ్రతికి 1887, డిసెంబరు 26 న ఇక్కడే సమాధి అయ్యారట. ఇతను గంగా నది మీద నడుచుకుంటూ వెళ్లేవారని ప్రతీతి. త్రిలింగ స్వామి విగ్రహం, వెనుకగా కాళీ మాత విగ్రహం ఉంటాయి. ఆ పక్కనే మఠం ఉంది.
బిందు మాధవ టెంపుల్: బిందు మాధవుడు చాలా అందంగా కనిపిస్తా డు. స్వామి స్వయంభువు. శాలి గ్రామం. నాలుగు చేతుల్లో పాంచజన్యం, సుదర్శనం, కమలం, కౌమోదకి ఉంటాయి.
అగ్ని బిందు మహర్షి, గండకీ నదీ తీరంలో, ముక్తి నాథ్ దగ్గర విష్ణువు కోసం తపస్సు చేస్తే, ప్రత్యక్షమై, తన విగ్రహాన్ని కాశీలో ప్రతిష్టించమని ఆదేశిస్తే, ఆ ఋషి పేరు మీదుగా బిందు మాధవుడు అయ్యారు.
పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి. (వేణీ మాధవ్- ప్రయాగ, సేతు మాధవ్- రామేశ్వరం కుంతి మాధవ్- పిఠాపురం, సుందర మాధవ్- తిరువనంతపురం) . బిందు మాధవుని పాదాల నుండి గంగ, యమున, సరస్వతి, కిరణ, ధుత్సప గంగలు, (ఇవే పంచ గంగలు) ప్రవహిస్తాయట. ఈ పంచ గంగ లలో స్నానం చేసి బిందు మాధవుని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని విశ్వాసం.
స్వామి విగ్రహం లోనే కొంచెం క్రిందుగా అమ్మవారి ముఖం ఉంటుంది. అక్కడ పూజారి చక్కగా అన్నీ చెప్పాడు. ఈ టెంపుల్ పంచ గంగ ఘాట్ దగ్గర ఉంటుంది. ఎక్కువ మందికి తెలియదు. పట్టుకోవడం కష్టం. ఈ ఆలయం లో చాలా శివ లింగాలు ఉంటాయి.
రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్: మణికర్ణికా ఘాట్ దగ్గర ఉంటుంది. ఇది భూమిలోనికి ఒరిగినట్లు ఉంటుంది.
గౌరీ కేదారేశ్వర ఆలయం: కేదార నాథ్ టెంపుల్ లో ఉన్నట్లు శివ లింగం, పూర్తిగా లింగాకారం కాకుండా ఉబ్బెత్తుగా వున్న రాయిలా ఉంటుంది. చుట్టూ పానిపట్టం. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఆ లింగం సగంలో చీలినట్లు ఉంటుంది అంటే గౌరీ సమేత కేదారేశ్వరుడు. చక్కగా అభిషేకం చేసు కోవచ్చు. బియ్యం, పెసర పప్పుతో చేసిన నైవేద్యం స్వామికి ప్రీతికరం. ఈ ఆలయంలో అందరు దేవుళ్ళు ఉన్నారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి,
ఇది కేదారేశ్వర ఘాట్ దగ్గర ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగులు వేసి ఉంటాయి. దూరానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. ఇక్కడకు బోట్ లో కూడా వెళ్ళవచ్చు. బిందుమాధవుని టెంపుల్ నుండి 400/- ఇచ్చి కేదారేశ్వర్ ఘాట్ కు వెళ్ళాం.
లోలార్క్ మహాదేవ్ టెంపుల్: ఇది సూర్యునిచే ప్రతిష్టించబడ్డ లింగం. ఇక్కడ నవ గ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే కుండం 50 అడుగుల లోతుంటుంది. దిగడానికి మెట్లు ఉంటాయి.ఈ నీరు పాతాళ లోకం నుండి వస్తుందని ప్రతీతి. ఇందులో స్నానం చేస్తే సంతానవతులు అవుతారని ప్రతీతి. అందుకని దంపతులు వచ్చి ఇందులో స్నానం చేస్తారు.
తిలా భండేశ్వర్ మహాదేవ్ మందిరం: చాలా పురాతనమైనది. ఇక్కడ శివ లింగం పెరుగుతుందని ప్రతీతి. ఇక్కడ శివకోటి స్తూపం ఉంది. సరస్వతి దేవి విగ్రహం, పార్వతి మాత, రామ మందిరం, గణేష్ మందిరాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి మందిరం ఉంది. మదంపురా వీవర్స్ కోలనీ దగ్గర ఉంది.
కాలభైరవ మందిరం
కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ య న దర్శనం కానిదే, కాశీ యాత్ర పూర్తి కాదు.
మృత్యుంజయ (శివుడు) మందిరం: కాలభైరవ మందిరంకు సమీపంలో ఉంటుంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.
కవళీ మాత (గవ్వలమ్మ) గుడి: ఈమె గవ్వలమ్ముకుని జీవిస్తూ, కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకున్నాక భుజించేది. ఒకనాడు ఆమెను ఒక అస్పృశ్యుడు ముట్టుకున్నాడని మరల గంగలో స్నానం చేసి బయటకు రాగానే, మరల ఆ అస్పృశ్యుడు ముట్టుకోవడం, మరల స్నానం చేయడం, అలాగ రాత్రి అయిపోయింది. ఆమెకు విశ్వనాధుని దర్శనం లేదు. భోజనం లేదు. కాశీలో ఎవరూ అభోజనంగా ఉండకూడదు. అందుకని అన్నపూర్ణా దేవి వచ్చి భోజనం చెయ్యమన్నా, విశ్వనాధుని దర్శనం కాలేదని ఆమె భోంచేయదు. దాంతో అన్నపూర్ణా దేవికి కోపం వచ్చి, కాశీ విడిచి వెళ్ళమని శపిస్తుంది. తల్లడిల్లిన ఆమె, శివుని ప్రార్ధించి తన అపరాధమేమిటని అడుగగా, నా దృష్టిలో అందరూ సమానులే, నీవు అస్పృశ్యుని పట్ల చేసిన తప్పిదం వలన నీకు ఈ శాపం. అయినా నీ భక్తికి మెచ్చాను. నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు " అని చెప్పి అదృశ్యం అయ్యాడు. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో " ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు " అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు. పూజా సామగ్రితో పాటు,5 గవ్వలు ఇస్తారు. అందులో 4 గవ్వలు కవళీ మాత దగ్గర పెట్టి, ఒక గవ్వ వెనుకకు ఇస్తారు.
సంకట మోచన్ హనుమాన్ మందిరం: కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ఇది చాలా విశాలమైన ఆవరణలో, చుట్టూ వృక్షాలతో సుమారుగా అరణ్యం మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ సెల్ ఫోన్లు లోపలకు తీసుకు వెళ్ళనివ్వరు.
ఈ
ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర్య సమరవేత్త, " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
" వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. మద్యయుగానికి చెందిన
సన్యాసి, రామాయణ ( తులసి రామాయణం) సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన
ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ,
శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్య
దైవాలైన సీతా రాముల వారి మందిరం హనుమాన్ మందిరం ఎదురుగుండా ఉంటుంది. ఇక్కడ భక్తులు
స్వామికి నైవేద్యంగా స్వీట్స్ సమర్పిస్తారు. ఆలయం కాంప్లెక్స్ లోనే స్వీట్స్ షాపు కూడా
ఉంది.
దుర్గా టెంపుల్:
దుర్గా
మాతను చక్కగా అలంకరించి ఉంటారు. అందరూ అమ్మకు స్వీట్స్ నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ
హోమం కూడా చేస్తున్నారు. సంకట్ మోచన్ రోడ్డులో ఉంది. ఎరుపు రంగు పెయింట్ తొ ఆకర్షణీయంగా
ఉంటుంది టెంపుల్.
తులసీ మానస మందిరం
ఇది
పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. రెండు అంతస్తులలో ఉంటుంది. క్రింద అంతస్తులో సీతారాముల
విగ్రహాలు ఉన్నాయి. పై అంతస్తులో తులసిదాస్ విగ్రహం ఉంది. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత
మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.పాలరాతితో
నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాలు మీద తులసీ రామాయణం లిఖింబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో
ప్రదర్శించబడుతున్నాయి. అలాగే కొన్ని రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కూడా ఇక్కడ భధ్రపరచబడి
ఉన్నాయి.
బిర్లా మందిరం
ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లా కుటుంబంచే నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత. ఈ ఆలయం కూడా రెండు అంతస్తులుగా ఉంటుంది. క్రింద అంతస్తులో శివ లింగం పెద్దది ఉంటుంది. పై అంతస్తులో కలశం ఉంటుంది. అందులో నుండి నీటి ధార శివ లింగం మీద పడుతుంది. క్రింద అంతస్తులో ఇంకా పార్వతి దేవి, నటరాజ స్వామి, గణేష్, సరస్వతీ మాత, హనుమాన్, పంచముఖ మహాదేవ్, నంది మందిరాలు ఉన్నాయి. ప్రాంగణమంతా చుట్టూ పూలమొక్కలతో చక్కని గార్డెన్ పెంచుతున్నారు.
సారనాధ్
బౌద్ధులకు ఎంతో పవిత్రమైన స్థలం. సారనాథ్ లో గౌతమ బుద్ధుడు తన మొదటి "ధర్మ" ఉపదేశాన్నిచ్చాడు, ఇచటనే బౌద్ధ సంఘాలు ఏర్పాటయ్యాయి. సారనాథ్ ఉత్తరప్రదేశ్ వారణాసికి ఈశాన్యదిశలో 13 కి.మీ. దూరాన గలదు. బౌద్ధ మత భక్తులు సందర్శించి తీరవలసిన ఐదు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. లుంబిని (బుద్ధుని జన్మ స్థలం), బోధిగయ (జ్ఞానోదయం అయిన ప్రదేశం), సారనాథ్ (మొదటిసారిగా ఉపదేశాన్నిచ్చిన ప్రదేశం), కుశీనగరం, గోరఖ్ పూర్ (బుద్ధుడు నిర్యాణం పొందిన ప్రదేశం, వైశాఖ పౌర్ణమి), అనూరాధ పురం, శ్రీలంక (రత్నమలి మహాస్థూపం)
గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తరువాత సుమారు 5 వారాలకు బోధిగయ నుండి, తన సహచరులైన ఐదుగురికి ధర్మోపదేశం చేయడానికి సారనాధ్కు వెళ్ళాడు. అది అషాఢ పూర్ణిమనాడు జరిగింది. ఇది మొదటి సంఘం స్థాపించబడిన ప్రదేశము.
శ్రీలంక నుండి కొమ్మ తెచ్చి ఇక్కడ నాటారట.
ఇక్కడ పెద్ద బుద్ధ విగ్రహం ఉంది (ఇది నడుస్తున్న భంగిమలో ఉంటుంది).దీనిని 843 రాతి పలకలను కలిపి నిర్మించారు. 2001లో, ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్లు ధ్వంసం చేసిన అతి పెద్ద బుద్ధ విగ్రహం యొక్క రాతి పలకలు దీని నిర్మాణంలో వాడారని అక్కడ గైడ్ చెప్పారు.
ఇక్కడ అశోక స్థూపం ఉంటుంది. అశోక స్థూపంలో నిజానికి 5 సింహాలు ఉంటాయి. స్థూపం పై భాగాన 4, క్రింద భాగంలో, ఒకవేపు సింహం (పరాక్రమానికి చిహ్నం), ఎద్దు (బుద్ధుని రాశి), ఏనుగు (బుద్ధుని జననానికి ముందు మాయా దేవి కలలో ఏనుగు కనిపిస్తుంది ), గుర్రం (కంధక్ అనే గుర్రం మీద బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు) ఉంటాయి. ఈ స్తంభంలో, 'కలువ పువ్వు' (క్రిందివైపుకు తిరిగివున్నది).
ఇక్కడ పెద్ద స్తూపం ఉంటుంది
ఉదయం
కారులో 7am కు బయలుదేరాం.
వింధ్యవాసిని టెంపుల్: వారణాశి నుండి 70km , ప్రయాగ నుండి
80km దూరంలో మీర్జాపూర్ జిల్లాలో ఉంది. రోడ్డు చాలా బాగుంది. కోవెలకు వెళ్ళే త్రోవంతా,
ఇరువైపులా షాపులు. మధ్య, మధ్యలో పార్కింగ్ ప్లేసులు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు.
ఇది
కూడా ఒక శక్తిపీఠం. మార్కండేయ పురాణం బట్టి ఈమె మహిషాసురుని వధించింది. ఇక్కడ అమ్మవారి
కళ్ళు పెద్దవిగా, చాలా అందంగా, మనలను ఆకట్టుకుంటాయి. అమ్మవారి చుట్టూ ఐరన్ గ్రిల్ ఉంటుంది.
పూజారులు మాత్రం వంద రూపాయలు ఇస్తే కాస్త నిలబడనిస్తారు. లేకపోతే తోసేస్తారు. వంద ఇస్తే
తల లోపలకు పెట్టనిస్తారు అక్కడుండేవాళ్ళు. 5 వందలిస్తే అమ్మవారిని ముట్టుకోనిస్తారు.
లేకపోతే అలా చూసుకుంటూ పోవడమే. పెద్ద రద్దీ లేకపోయినా అంతే.
అందులోనే
ఒక వేపు శివ కోవెల, లక్ష్మి నారాయణులు ఉన్నారు. ఇక్కడంతా డబ్బే. ఎవరికీ కొంచెం కూడా
భక్తి లేదు.
త్రివేణి సంగమం: ఇది అలహాబాద్ లో, ప్రయాగ్ రాజ్ లో ఉంది. మూడు నదులు, గంగ, యమున, సరస్వతి(అంతర్వాహినిగా) సంగమం. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని హిందువుల నమ్మకం. కాని ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే సదుపాయం లేదు. గంగ నీళ్ళు ఎర్రగా, యమున నీళ్ళు ఆకుపచ్చగా కనిపిస్తాయి. పడవ కట్టడానికి నలుగురు మనుషులకు 1200/- తీసుకున్నాడు. నది ఒడ్డున చాలా పడవలు ఉన్నాయి. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. అందరూ జంతికలు కొని వేస్తుంటే తినడానికి గుంపులుగా వస్తున్నాయి.
ఇక్కడకు దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ హనుమాన్ పడుకున్నట్లు ఉంటారు. మెట్లు దిగి క్రిందకు వెళితే స్వామిని దర్శించవచ్చు. ఇక్కడ పరిశుభ్రత తక్కువే.
అలహబాద్ ఫోర్ట్: యమున నది ఒడ్డున ఉంటుంది. ఇది అక్బర్ చే నిర్మించబడింది. దీని లోపల అక్షయ వృక్షం, అశోక పిల్లర్, కోవెల, ఇంకా అందమైన భవనాలు సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. దీని సందర్శన వేళలు 7am-6pm. ప్రవేశ రుసుము లేదు
కాని మేము వెళ్ళినపుడు కరోనా వైరస్ కారణంగా సందర్శకులను అనుమతించలేదు.
అలోపిదేవి (మాధవేశ్వరి): శక్తి పీఠం. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఒక డోలీ (పల్లకి)నే అమ్మ స్వరూపంగా పూజిస్తారు. సతీ దేవి ఆఖరి శరీర భాగాలు ఇక్కడ పడి, సతీదేవి అదృశ్యమైందని, అలోపి దేవి అంటారు. చతురస్రాకారపు గట్టు మీద చిన్న డోలీ ఉంటుంది. దానినే పూజిస్తారు. ఆ డోలీ కింద చిన్న కుండం ఉంది, అందులో పువ్వులు వేస్తున్నారు. మంగళ వారం రద్దీ ఎక్కువగా ఉంటుందట. ప్రవేశ రుసుం లేదు. మేము వెళ్ళినప్పటికి 1pm అయింది. కర్టెన్లు వేసి ఉన్నాయి. ఒక అర్ధ గంటలో తలుపులు తీసి లోపలకు రానిచ్చారు.
ఈ గుడి వెనుక శీతలా దేవి (భగవతి జాలపాదేవి) గుడి ఉంది.
ఆనంద నిలయం:
మోతీలాల్ నెహ్రూ నివాస భవనం. 1970 లో అప్పటి ప్రధాన
మంత్రి ఇందిరా గాంధి ఈ భవనాన్నిప్రభుత్వపరం చేసారు. ఇందులో
జవహర్ ప్లానటోరియం, మ్యూజియం నడుపుతున్నారు. ప్రవేశ రుసుం ఉంది. ప్లానటోరియంకు Rs 60/-, మ్యూజియంకు Rs 70/- దీని సందర్శన వేళలు 9.30am-5pm. కాని మేము వెళ్ళినపుడు కరోనా వైరస్ కారణంగా సందర్శకులను అనుమతించలేదు.
అలహాబాద్ నుండి సీతామరి: సీతామరి బీహార్ స్టేట్ లో ఉంది. సీతాదేవి ఇక్కడే వాల్మీకి ఆశ్రమంలో లవ, కుశలకు జన్మను ఇచ్చింది. సీతాదేవి భూప్రవేశం చేసిన ప్రదేశం ఇదే.
సీతమరి ఒక పల్లెటూరు. ఆ ఊరికి పల్లెటూర్ల మధ్య నుండి వెళ్ళాలి. రోడ్డు కూడా అంత బాగా ఉండదు. ఊరు అంత బాగా డెవలప్ అవలేదు. అక్కడకు చేరగానే ఎదురుగా కొండ మీద శివుడు కూచున్నట్లు, శివుని శిరస్సు నుండి గంగ పడుతున్నట్లు, అవి మెట్ల మీద నుండి జారి క్రిందకు వస్తున్నట్లు ఒక మోడల్ తయారుచేసి పెట్టారు. కొంచెం లోపలకు వెళితే సీతా మందిర్ ఉంటుంది. అది రెండంతస్తుల భవనం. చుట్టూ కొలను ఉంటుంది. అందులో రెండు నావలు కూడా ఉన్నాయి. అదివరకు ఆ నావలో వాల్మీకి మహర్షి, లవ, కుశలు ఉన్నట్లు ఉండేదట. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి నావలు. ఆ కొలను శుభ్రం చేయలేదు. నీరంతా నాచుపట్టి బురదగా ఉంది.
పై అంతస్తులో సీతాదేవి పాలరాతి విగ్రహం చక్కగా అలంకరించి ఉంటుంది. క్రింద అంతస్తులో సీతాదేవి భూప్రవేశం చేస్తున్నట్లు ఉంటుంది. తెల్లని చీరలో ఆఖరికి తలకట్టు కూడా తెల్లగా....కాని ఈ క్రింద అంతస్తు కరోనా నుండి క్లోజ్ చేసేసారు.
ఆ కాంపౌండ్ లోనే మంచి హోటల్ కూడా ఉంది.
గేట్ బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళితే హనుమాన్ మందిరం ఉంది.లోపల హనుమాన్ విగ్రహం ఉంది. ఆ మందిరంలో చుట్టూ గోడలకు రామాయణానికి సంబందించిన వర్ణ చిత్రాలు ఉన్నాయి. అక్కడ డబ్బులు వేయలేదని అవి చూడడానికి కూడా ఒప్పుకోలేదు అక్కడున్న వ్యక్తి. మందిరం బయట చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది.
అక్కడ నుండి ఆటో ఎక్కి వెళితే (1km distance) వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. అది ఒక చిన్న మందిరం cum ఇల్లు లాగ ఉంది. ఎవరో నివాసం ఉంటున్నారు. మంచాలు అవీ ఉన్నాయి. ఇక్కడే లవ, కుశలు పుట్టారట.
రాత్రి 7.30pm కు వారణాశి చేరుకున్నాం.
19-3-2020
Varanasi to Ayodhya
ఉదయం 6am కు టేక్సీలో బయలుదేరాం. రోడ్డు బాగుంది. 10.30కు ప్రయాగ చేరుకున్నాం. తిన్నగా సరయూ నదికి వెళ్ళి స్నానాలు చేసాం. ఇక్కడ చాలా తక్కువమంది ఉన్నారు ఈ రోజు. ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కొద్దిగా మరుగు ఉంది.
డ్రైవర్ ఏర్పాటు చేసిన గైడ్ వచ్చి, అయోధ్య రామ మందిరం (రామ జన్మభూమి) నిర్మాణం కోసం పాలరాతి స్తంభాలు అవీ చెక్కుతున్న ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. రామ మందిరం మోడల్ కూడా గ్లాస్ బాక్స్ లో ఉంది. ఫుల్ సెక్యూరిటీ ఉంది. అద్వానీ పిలుపు మేరకు, శ్రీరామ అని వ్రాసి తెచ్చిన ఇటుకలు కూడా ఒక పక్క ఉన్నాయి. వాటిని రామ మందిరం నిర్మాణంలో వాడతారట.
అక్కడ నుండి శ్రీరామ దర్బారు కు వెళ్ళాం. అందులో సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముల వారి పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. ఇంక లోపల ఎవరో స్వామీజీ ఉన్నారు, రండి అంటే వద్దనేసాం. అక్కడకు వెళ్ళాక డబ్బులు వెయ్యమంటారట.
అందులోనే సీతాదేవి వంటిళ్ళు ఉంది. అక్కడ ఫ్రీ మీల్స్ పెడతారట. అక్కడున్న హుండీలో డొనేషన్ వేసాం. బయటకు వస్తే ఓ పదడుగులు వేసాక వేసాక హనుమాన్ మందిరం ఉంది. అందులో కూడా సీతా, రామ, లక్ష్మణుల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి.
తర్వాత ఆంధ్రా భోజనం అని తెలుగులో రాసి ఉన్న చిన్న హోటల్ కు వెళ్ళి భోంచేసాం.
రామ జన్మభూమి11am నుండి 1pm వరకు క్లోజ్ అట. అందుకని 1.30pm కు వెళ్ళాం. గైడ్ అలా వెళ్ళండి అని చెప్పేసి ఉండిపోయాడు. మేము అలా చెకింగ్ పోస్ట్ లు దాటుకుంటూ ముందుకు చాలా దూరం వెళ్ళాక, పూర్తిగా ఐరన్ మెష్, గ్రిల్స్ తో చేసిన క్యూ లైన్ లో చాలా దూరం వెళితే ఒక దగ్గర చిన్న శ్రీరాముల వారి పాలరాతి విగ్రహం రెండడుగులు కూడా ఉండదు, దాని దిగువున లక్ష్మణ, భరత, శతృఘ్నుల విగ్రహాలు ఉన్నాయి. అవి చూసాక ఇంత దూరం ఇవేనా చూడడానికి వచ్చాం అనిపిస్తుంది. కాని రాముడు పుట్టిన ప్రదేశంలో మనం కూడా ఉన్నాం అని ఫీల్ అయితే, దాని విలువ తెలుస్తుంది. అడుగడుగునా పేరా మిలటరీ ఫోర్సెస్. ఇక్కడేమీ లేదు కదా ఎందుకింత సెక్యూరిటీ అంటే , ఒకతను రహస్యంగా చాలా సెన్సిటివ్ ఏరియా కదా, టెర్రరిస్టుల ఎటాక్ ఉండొచ్చు అందుకే అని చెప్పాడు. అక్కడ బాబ్రీ మసీద్ తాలూకా ఆనవాళ్ళూ ఏమీ కనిపించలేదు. ఇటుకలతో కట్టిన గోడ కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఐరన్ బారికేడ్స్ తో, మధ్యలో పిచ్చి మొక్కలతో , అడుగడుగునా సెక్యురిటీ వాళ్ళతో ఉంది ఆ స్థలం అంతా.
రాత్రి 7.30pmకి వారణాశి చేరుకున్నాం.
How to plan & when to plan:
కాశీ యాత్ర చేద్దామనుకునే వాళ్ళు టైం ఉంటే ఒక రోజు గయ, ఒక రోజు అయోధ్య,ఒక రోజు ప్రయాగ టూర్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాశీ విశ్వనాధుని దర్శనంతో పాటు చుట్టు పక్కల యాత్రా స్థలాలు(సారనాధ్, గవ్వలమ్మ గుడి) ఒక రోజు, ఊరిలో ఉన్న ఆలయాలు ఒక రోజు ప్లాన్ చేసుకుంటే అన్నీ చూడవచ్చు. రద్దీ లేని రోజుల్లో కాశీ వెళితే తనివితీరా దర్శనాలు చేసుకోవచ్చు. మేము వెళ్ళిన రోజులు కరోనా వ్యాప్తి చెందే రోజులు కాబట్టి కొన్ని దర్శనాలు ఆపేశారు. లక్కీగా మేమన్నీ ఆ ముందు రోజే చూసేయడం జరిగింది. అలాగే మేము మార్చ్ 23న ఫ్లైట్ లో వైజాగ్ చేరిపోయాం, లాక్ డౌన్ ప్రకటించేసారు.
మధ్యలో ఒకరోజు మా వారు సిక్ అవబట్టి మేము గయ చూడలేకపోయాం.
Comments
Post a Comment