Puri, Bhuvaneswar Tour (పూరీ, భువనేశ్వర్ యాత్రా విశేషాలు) 7-11-19 To 10-11-19

Puri & Bhuvaneswar tour

చార్ ధాం యాత్రలో ఉన్న నాలుగు ధామాలలో పూరీ ఒకటి. మిగిలినవి రామేశ్వరం, ద్వారక, బదరీనాధ్. ఎప్పటినుండో అనుకుంటుంటే ఇప్పటికి ప్రాప్తించింది ఇక్కడకు రావడం

పూరీలో  సముద్ర స్నానం కోసం బీచ్ కు వెళ్ళాం. బీచ్ వైజాగ్ లోలా ఏటవాలుగా లేదు. గట్టులాగ ఎత్తుగా ఉండి, వెంటనే డీప్ గా ఉంది. అందుకే నేను స్నానానికి వెళ్లకుండా ఒడ్డునే ఉన్నాను. నాతో వచ్చిన వాళ్లు నీటిలో దిగారు. పెద్ద అలలు వస్తున్నాయి. అలా రెండు అలలు వచ్చినపుడు, ఒకరిని మీదకు తోసేసింది. మరో ఇద్దరిని మొత్తం ముంచేసింది. కొంచెంలో   ప్రమాదం తప్పింది. అదే లోపలకు లాగేసి ఉంటే....బహుశా టూర్ గురించి నేను రాసి ఉండనేమో.అక్కడ నుండి వెంటనే రూం కు వెళ్ళి ఫ్రెష్ అయి దర్శనాలకు బయలు దేరాం.

 సముద్ర స్నానం చేయాలనుకునే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని చేస్తే తరువాత విచారించ వలసిన అవసరం రాదు. పిల్లలున్నప్పుడు ఇంకా జాగ్రత్త అవసరం.

చోటా గోపాల్ టెంపుల్ కు వెళ్ళాం. ఇక్కడ రాధా కృష్ట్నుల మూర్తులు ఉన్నాయి.

నరేంద్ర టాంక్ కు వెళ్ళాం. ఇది చాలా పెద్దది. 800 అడుగుల పొడవు, వెడల్పులతో విశాలంగా ఉంది. శుభ్రంగా ఉంది. జగన్నాథ స్వామి నౌకా విహారానికి ఇక్కడకు వస్తారు. పెద్ద ప్లాట్ ఫారం ఉంది. అందులో  మెయిన్ గా లక్ష్మీ దేవి విగ్రహం ఉంది. మిగిలిన దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి డాలర్ ఇచ్చి, చేతికి ఒక తాడు కట్టేసి ఏభై ఇవ్వు, ఇరవై ఇవ్వు అని డిమాండ్ చేస్తున్నారు. గోత్ర నామాలు చదివి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ దానికి ఒక రేటు.

గుండిచా ఆలయం

ఒరిస్సా రాజు భార్య గుండిచా పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది రధాయాత్ర సమయంలో జగన్నాథ స్వామి విడిది చేసే ఆలయం. ప్రపంచంలో హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఒక్క పూరీలోనే మూల విరాట్టును ఊరేగింపుగా తీసుకు వచ్చి, ఇక్కడ వారం రోజుల పాటు కొలువుంచుతారు. జగన్నాథ, సుభద్ర, బలభద్రులను పెట్టడానికి పెద్ద పీఠాలు ఉన్నాయి.   వారం రోజులూ కొన్ని లక్షల మంది భక్తులు గుండిచా ఆలయంలోని జగన్నాధుని దర్శించుకుంటారు.


బయట ప్రహరీగోడ లోపల రథచక్రాలు ఉన్నాయి. రథ యాత్రకు వాడిన చక్రాలట. ఎవరైనా కొనుక్కోవచ్చట. ఇంట్లో పెట్టుకుంటారట. లేకపోతే పొలం దున్నడానికి సెంటి మెంటల్ గా మంచిదన్న భావనతో వాడతారట.

లోపల ప్రవేశ ద్వారం ఒకటి , బయటకు వచ్చే ద్వారం ఒకటి. వన్ వే. లోపల పార్టిషన్ లాగ చేసి ఒక్కో దగ్గర ఒక్కో దేవున్ని పెట్టి, అక్కడున్న పండాలు డబ్బులు దండు కుంటున్నారు. క్షమించాలి. ఇలా అన్నందుకు. దక్షిణ, అదీ పెద్ద మొత్తంలో వెయ్యకపోతే సరిగ్గా దర్శనం కూడా చేసుకోనివ్వడం లేదు.

ఆషాఢ శుక్ల విదియనాడు పండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి విగ్రహాలను రధాల మీదకు చేరుస్తారు. . పూరీ రాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

విగ్రహాలను రధాల మీద ఊరేగింపుగా గుండిచా ఆలయానికి  తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. దశలో కులమత భేదాలకు తావుండదు. రధాలను తిప్పడానికి వీలుగా ఈ గుండిచా టెంపుల్ ఎదురు రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. జగన్నాథుడి రథం నందిఘోష. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం పద్మ ధ్వజం.

వారం రోజులు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు .

శంకరమఠం

ఆది శంకరాచార్యుల వారు దేశం నాలుగు దిక్కులా స్థాపించిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి ప్రతిమ, శివాలయం, ఇంకా మీదకు వెళితే కాళీ మాత ఆలయం ఉన్నాయి. ప్రశాంతంగా ఉంది. చాలా విశాలంగా ఉంది. చాలా శుభ్రంగా ఉంచారు. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని పిలుస్తారు. మిగిలినవి  ద్వారకా మఠము, గోవర్ధన మఠము, శృంగేరీ మఠము.


సిద్ధవకుల్ మఠం

ఇక్కడ జగన్నాధుని ప్రతిమ, రాధాకృష్ట్ణుల ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే చైతన్య దేవ్ జగన్నాధుని పళ్ళు తోముకునే పుల్లని, (ఇది వకుళ వృక్షం పుల్ల) పాతితే వృక్షం అయిందట. ఇంతకీ వృక్షం ప్రత్యేకత ఏమిటంటే చెట్టు మజ్జ (Tree marrow) ఉండదు. బయట బెరడు (Tree skin) మాత్రమే ఉంటుంది. విషయం మనకు చక్కగా కనిపిస్తుంది


జగన్నాధ స్వామి ఆలయం

బయటకు ఆలయ శిఖరం చక్కగా కనిపిస్తుంది.

ఫోన్లు లోపలకు తీసుకు వెళ్ళనివ్వరు. ఉదయం 5am నుండి రాత్రి10pm వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం.

ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పున ఉండే సింహ ద్వారం ( ద్వారానికి ఇరువైపులా రెండు సింహాలు ఉంటాయి), ద్వారం గుండానే జగన్నాధుడు గుండిచా ఆలయానికి  వెళ్ళడం, రావడం జరుగుతుంది. మిగిలిన ద్వారాలకు ఇరువైపులా ఏనుగులు (హస్తి ద్వారం), పెద్ద పులులు (వ్యాఘ్రద్వారం), అశ్వాలు (అశ్వద్వారం) ఉంటాయి. 

ఆలయ గోపురం చాలా ఎత్తుగా ఉంది. 214 అడుగుల ఎత్తు (65m)

తల పూర్తిగా ఎత్తి చూడాల్సిందే. కర్రతో చేసినట్లు అనిపించేలా రాయిని చెక్కారు. చూస్తుంటే కళ్ళు పట్టడం లేదు. అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎక్కడకు వెళితే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అదేనేమో జగన్నాధ ఆలయం ప్రత్యేకత. తమిళనాడులో ఎన్నో ఆలయాలు చూసాను. బృహదేశ్వరాలయం గోపురం చూడగానే ఆకట్టుకుంటుంది. తరువాత నన్ను ఆకట్టుకునే గోపురం ఇదే. చూస్తున్న కొలదీ చూడాలనిపిస్తుంది. చెక్కతో చేసినట్లు అనిపిస్తుందేమో! అందమే వేరు. చూసి తీరాలి. అంతే!

ఆలయ విగ్రహాలు దారువు (చెక్క) తో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.

జనం విపరీతంగా ఉన్నారు. మనలను తోసుకుంటూ వెళుతున్నారు. అలాగే లోపలకు వెళ్ళాం. ఒకటే తోపులాట. జగన్నాధ స్వామి ఎదురుగా మనలను నిలవనిచ్చేది క్షణ కాలమే. క్షణంలో స్వామి ఎంత అందంగా అగుపించారో. జీవకళ ఉట్టిపడుతుంది. పెద్ద కళ్ళతో.. అబ్బో! అప్పుడు కలిగిన భావం వర్ణించడం నావళ్ళ కాదు. ఇంక సుభద్రా దేవి, జగన్నాధ స్వామి దారు మూర్తులు కూడా అంతే! సజీవంగా ఉన్నట్లు ఉన్నారు. వారిద్దరి కంటే కూడా, నలుపు రంగులో ఉన్న జగన్నాధ స్వామి మరింత అందంగా ఉన్నారు. కాస్సేపు నిలబడి చూద్దామన్నా ప్రత్యేక దర్శనాలు సమయంలో ఏమీ లేవు. జనం తోసేస్తున్నారు. అయినా మరల క్యూ లోకి వెళ్ళి మరల చూసాం. అక్కడే, పండాలు ప్రసాదం తెచ్చి అమ్ముతుంటే కొనుక్కున్నాం.

బయటకు వచ్చి మిగిలిన ఆలయాలు చూసాం.

ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. ఆంజనేయ స్వామి నిలువెత్తు మూర్తి. సింధూరం వర్ణంలో ఉన్నారు. చాలా అందంగా అనిపించారు.

గణేశుని నిలువెత్తు మూర్తి మనలను చూస్తున్నట్లే ఉంది.

మహలక్ష్మి దేవి మందిరం: అమ్మ మనలను చూస్తున్నట్లే ఉంది. ఎంత అందం! కళ్ళు తిప్పుకోనివ్వని రూపం. అలంకారం అద్భుతం. అస్సలు బయటకు రాబుద్ధి కాలేదు. చాలా సేపు లోపలే ఉన్నాం. మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య పాత్ర ఉంది. జగన్నాథునికి పెట్టె నైవేద్యాన్ని మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెబుతారు.

ఇంకా సత్యన్నారాయణ స్వామి మందిరం

రాధాకృష్ట్ణుల మందిరం.

సూర్య భగవానుడు, నరసింహ మందిరాలు కూడా ఉన్నాయి           

ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాల కోసం అనేక మండపాలు ఉన్నాయి.

జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు.  వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.

ఆలయం గురించిన మరి కొన్ని విశేషాలు: 1. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం మనం ఎటు నుండి చూసినా అటు వైపే ఉన్నట్లు కనిపిస్తుందట. 2. శిఖరం మీద ఎరుపు రంగు పతాకం ఉంటే స్వామి ఆలయంలో ఉన్నట్లట. 3.శిఖరం మీద  పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందట. 4. ఆలయంపై పక్షులు ఎగరవట.

జగన్నాధుని దర్శనం అయ్యాక కలిగిన భావన

హిందూ మత విశ్వాసాలకు ప్రతీక

దారువులో అందమైన అమరిక

 క్షణమాత్రపు వీక్షణం కోసం

సంవత్సరాలుగా నిరీక్షణం

 వేలాది భక్తుల రాక

దర్శనానికి ఉండాలి ఓపిక

 పరివార దేవతలతో కొలువు

అదే జగన్నాధ, సుభద్ర, బలభద్రుల నెలవు

భువనేశ్వర్ లో చూడవలసినవి లింగరాజు టెంపుల్, కేదార గౌరి టెంపుల్ కాంప్లెక్స్, బిందుసాగరం, ISCON టెంపుల్

భువనేశ్వర్ లింగరాజు టెంపుల్



భువనేశ్వర్ లో అతి పెద్దది, పురాతనమైనది. ఇది 11 శతాబ్దంలో నిర్మితమైనది. ఇక్కడ శివుడు త్రిభువనేశ్వర్ గా కొలవబడతాడు. అమ్మవారిని భువనేశ్వరి మాతగా కొలుస్తారు. ఇక్కడ శివుడు లింగాకారంగా కాకుండా సహజసిద్ధంగా, ఒక ప్రత్యేక ఆకారంలేని రాయి రూపంలో కొలువై ఉన్నారు. ఇది ఒక శక్తి పీఠం మీద కొలువై ఉంటుంది. దీనిని కృతిబాస లేదా స్వయంభువు అంటారు. ఇక్కడ శివుడు, విష్ట్ణువుగా కూడా అంటే హరిహరుడుగా కొలవబడతాడు. ఇక్కడ స్వామిని బిల్వ పత్రాలతో పాటు, తులసి పత్రాలతో కూడా పూజిస్తారు.

భువనేశ్వర్ ను ఏకామ్ర (మామిడి-Mango) క్షేత్రం అంటారు.

ముఖ్య గోపురం 180(55m) అడుగుల ఎత్తు. పూరీ జగన్నాధ స్వామి ఆలయంలో ఉన్నట్లు గోపురం ఉంటుంది. అది కొంఛెం డార్క్ కలర్ లో కనిపిస్తుంది  ఇది ఇసుక రాయితో కట్టబడింది కనుక కొంచెం లేత రంగులో కనిపిస్తుంది. 

ఆలయంలో చిన్న, చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి.

ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం. సెల్ ఫోన్లు లోపలకు తీసుకు పోనివ్వరు. సెల్ ఫోన్ల కౌంటర్, షూ స్టాండ్ పక్కనే ఉంటాయి.ముఖ్య ప్రవేశ ద్వారం తూర్పున ఉంది. దీనిని  గంధపు చెక్కతో చేసారు.మరో రెండు చిన్న ద్వారాలు ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉన్నాయి. ఉదయం 6am నుండి రాత్రి 9pm వరకు దర్శనం ఉంటుంది.

మధ్యాహ్నం 12 నుండి 3.30 వరకు మూసి ఉంటుంది.భోగం సమర్పిస్తారు. శివరాత్రి పర్వదినం ఘనంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో జరుగుతుంది.

మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా విఘ్నేశ్వరుని దర్శనం అవుతుంది. పాతాళ గణపతి ప్రతిమ రెండడుగులు క్రింద ఉన్నట్లు ఉంటుంది. కళ్ళు, చిట్లించి మనను పట్టి, పట్టి చూస్తున్నట్లు అనిపిస్తుంది.

ఆలయం ఎదురుగా ధ్వజ స్థంభం ఉంది. అక్కడ దంపతులను అటూ, ఇటూ నిలబడి స్థంభాన్ని చేతులతో చుట్టి, ఒకరినొకరిని పట్టుకోమంటున్నారు.

అదయ్యాక లోపలికి, గర్భ గుడిలోనికి వెళ్ళాం. స్వామికి అప్పుడే అభిషేకం చేసినట్లున్నారు, ఇంకా అలంకారం చేయ లేదు. జనం ఎక్కువ లేరు. చక్కని దర్శనం అయింది. ఇక్కడ పండాలు మంచివాళ్ళు. దక్షిణ ఇస్తే తీసుకుంటున్నారు. అసలు అడగడం లేదు. ఎంతసేపు ఉన్నా ఏమీ అనలేదు. అంతకు ముందు నేను వెళ్ళినపుడు శివునికి పెద్ద, పెద్ద కళ్ళు, పెద్ద మీసాలతో అలంకారం చేసారు.( అప్పుడు కలిగిన భావన- విభూది రేఖలవాడు, విశాల నయనాలవాడు, పెద్ద, పెద్ద మీసాల వాడు, కనువిందు చేసినాడు, దండిగా దర్శనమిచ్చినాడు). ఇప్పుడు నిజ రూపం చూసాను.

మనం నిలుచున్న చోటుకు కుడి వేపున లక్ష్మీ దేవి అమ్మవారు ఉన్నారు.

బయటకు వస్తే కుడివేపున పార్వతి అమ్మ ఆలయం ఉంది. దీపాలు పెట్టుకోవచ్చు. అక్కడ దీపాలు అమ్ముతున్నారు. చెవుల వరకు ఉన్న కళ్ళతో, గంధం పూసి అలంకారం చేసారు. చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు. ఎప్పుడూ అమ్మవారిని ఆడంబరంగా అలంకరిస్తారు.

భువనేశ్వరీ మాత ఆలయం ఉంది.ఇక్కడా దీపాలు పెట్టుకోవచ్చు. ఇక్కడా దీపాలు అమ్ముతున్నారు.

యమధర్మ రాజు ఆలయం

సవిత్రి మాత ఆలయం

అలాగే ద్వాదశ జ్యోత్ర్లింగాలకు మందిరాలు ఉన్నాయి.

ఆలయానికి ఎడమవేపున శక్తి పీఠం అని చెప్పి అక్కడ మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇంకెక్కడా డబ్బులు అడగడం లేదు.

నందికి ఒక మందిరం ఉంది. పెద్ద నంది.

ఆలయంలో  చిన్నా, పెద్దా, కలిసి 150 ఆలయాలు ఉంటాయి. ఎక్కువ శివ లింగాలే. మేము అన్నీ చూడలేదు.

ఆలయం మూడు పక్కలా (ముందు వేపు కాకుండా) మీదకు మెట్లు ఉండి అక్కడ చిన్న ఆలయాలు ఉన్నాయి.ఎడమవేపు పెద్ద గణపతి ప్రతిమ ఉంది.కళ్ళు భలేగా ఉన్నాయి. గవ్వలతో చేసినట్లు ఉన్నాయి. నిజంగా కళ్ళతో చూస్తున్నట్లే ఉంది. గణపతి కొంచెం పక్కకు చూస్తున్నట్లు ఉంటుంది.

మిగిలిన రెండు వేపులా విగ్రహాలు ఉన్నాయి కాని అక్కడెవరూ పండాలు లేరు. అందుకు అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోలేక పోయాను.

కుడివేపున అరుగులా మండపం ఉంది. అక్కడ కూచుంటే ప్రశాంతంగా ఉంది.

పూరీలో క్షణ మాత్రం గర్భ గుడిలో ఉండలేం. అంత రద్దీ అక్కడ. ఇక్కడ ప్రశాంతంగా ఎంతసేపన్నా ఉండవచ్చు, మీకు టైం ఉంటే.

బయటకు వచ్చేటపుడు తృప్తితో వస్తాం. అదే పూరీలో అయితే తృప్తి ఉండదు. ఇంకాసేపు చూడగలిగితే బాగుణ్ణు అనిపిస్తుంది.

కేదార గౌరి చౌక్ దగ్గర ఉన్న కేదారేశ్వర్ టెంపుల్ కాంప్లెక్స్ లో, కేదారేశ్వర్ టెంపుల్, కేదార గౌరి టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్, సిద్ధేశ్వర్ టెంపుల్ ఉంటాయి.ఆలయాలు పెద్దవిగా, పూరీ జగన్నాధ్ ఆలయంలోలా గోపురాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణలో ఉన్నాయి. ఎక్కువ మంది లేరు ఇక్కడ. లింగరాజు టెంపుల్ కు 1-2 దూరంలో ఉంది.



రెండు ఆలయాల మధ్యలో బిందుసాగరం రోడ్డు దగ్గర బిందుసాగరం ఉంది.

బిందుసాగరం: ఇది భువనేశ్వర్లో ఉన్న పెద్ద మంచి నీటి కొలను. 450m X 175m X 7m వైశాల్యంలో ఉంటుంది. చుట్టూ ఎర్రటి పలకలు పరిచి ఉంటాయి. స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయి. చందన యాత్ర సమయంలో నీటి మధ్యలో ఉన్న మందిరానికి, నావలో లింగరాజ స్వామి చేరుకుంటారు.  నాలుగు పక్కలా వివిధ దేవాలయాలు ఉన్నాయి.

దీని ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన గాధ ఉంది. పూర్వం శివుడు కాశీలో ప్రశాంతత దొరకక ఇక్కడకు వచ్చి ఏకామ్ర (మామిడి) చెట్టు క్రింద ధ్యానం చేసుకుంటుంటే, విషయం తెలుసుకున్న పార్వతి , తను కూడా ఇక్కడకు వచ్చి, శివుని కాపాడుతుంటే, ఆమెను కాంక్షించిన ఇద్దరు అసురులను ఆమె సంహరించినప్పుడు ఆమెకు కలిగిన దాహార్తిని తీర్చడానికి త్రిశూలంతో భూమిని కొట్టగా వచ్చిన నీటి ధార బిందుసాగరం. అందుకే దీనిని ఏకామ్ర క్షేత్రం అంటారు. 

ISCON Temple:

P.S.:పై వివరాలు చదివాక మీ స్పందన (comment) ను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

               

 


Comments

Post a Comment

Popular posts from this blog

Sri lanka Tour from 4-1-2019 to 12-1-2019

కైలాస మానస సరోవర యాత్ర- నా అనుభవాలు