Telugu story-ఊడల మాను
ఊడల మాను
3-6-15
“అమ్మా బట్టలు సర్దుకో. రేపు ఉదయమే ఊరికి దిగబెడతాను" విన్న శాంతమ్మకు కలో, నిజమో అర్ధం కాలేదు. గత ఆరు నెలలుగా ఊరికి పంపించమని ఎంత అడిగినా “నువ్వెళ్ళిపోతే రమ ఒక్కతే ఎలా చేసుకో గలదు. అక్కడైనా నువ్వొక్కదానివే కదా! అదే ఇక్కడుంటే ఏమైంది?” అని అంటున్న కొడుకు ఇలా ఊరి నుండి వచ్చీ రాగానే ఈ మాటలంటుంటే సంతోషం బదులు వీడిలో ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుందా అన్న ఆలోచనలో పడిపోయింది శాంతమ్మ. కోడలు రెండవసారి నెల తప్పింది. బాబుతో ఒక్కతీ చేసుకోలేకపోతుంది అని కొడుకు తీసుకు వచ్చాడు ఇక్కడకు. కోడలికి వేవిళ్ళు అవీ తగ్గిపోయి కాస్త బాగానే ఉంది అనిపించగానే కొడుకును అడిగింది “ఊరికి వెళ్ళిపోతాను. మరల కానుపు సమయంలో వస్తాను” అని. “ఈ సమయంలో బాబుని రమ ఒక్కతే ఎలా చూసుకోగలదు. నువ్వుండి బాబును చూసుకో” అనేశాడు కొడుకు. ఏమనలేకపోయింది.
పక్క గదిలో ఉండి ఆ మాటలు విన్న రమ కూడా ఈయనకు మతి పోయింది. ఈ సమయములో ఈవిడను పంపిస్తే ఎలాగ? ఇంకా రెండు నెలలకు కానుపు వస్తుందని డాక్టరు గారు చెప్పారు.ఈవిడుంటే ఇంకో ఆరు నెలలలో తనూ జాబుకు వెళ్ళొచ్చు అని కదా అనుకున్నారు. ఇప్పుడేమయింది ఈయనకు? ప్రసాదు గదిలోకి రాగానే ఆ మాటే అడిగేసింది. “ఇప్పుడు మీ అమ్మగారిని ఊరికి పంపిస్తే ఎలాగండి?” అని. “అమ్మ రాకముందు మనం లేమా ఇక్కడ?” “అప్పుడంటే ఇంకో మనిషి అవసరం పడలేదు. ఇప్పుడలాగ కాదు.” “అంటే మనిషి అవసరం కాబట్టి తెచ్చుకున్నాము. అంతేగాని ఆవిడ మా అమ్మ అని మనం తెచ్చుకోలేదన్న మాట.” “నా ఉద్దేశం అదికాదు. అవసరానికి ఇంట్లో వాళ్ళు కాకపోతే బయట వాళ్ళు వస్తారా!” “రమా! నువ్వే ఉద్దేశంతో అన్నా నిజమే చెప్పావు. బాబు పుట్టక ముందు మూడేళ్ళు మనం ఇద్దరమే ఉన్నాము. లైఫ్ ఎంజాయ్ చేసాము. అప్పుడు ఒక్క రోజు కూడా మా అమ్మ మనకు గుర్తుకు రాలేదు. ఒక్క రోజు కూడా మా అమ్మను మనం రమ్మనలేదు. ఇప్పుడు అవసరం కాబట్టి ఆవిడను తెచ్చుకున్నాము. నిజంగా మాటాడాల్సి వస్తే ఆవిడను ఒక ఆయాగా తెచ్చుకున్నామని ఇప్పుడు అర్ధం అయింది. నా సుఖంలో మా అమ్మ గుర్తు రాలేదు. అవసరంలో అమ్మను గుర్తు పెట్టుకున్నాను. నేను ఎంత స్వార్ధపరుడినో చూసావా రమా! మా అమ్మ మమ్మల్ని పెంచడం తన బాధ్యత అనుకుంది. నేను నా పిల్లల్ని పెంచడం కూడా ఆవిడ బాధ్యతే అనుకుంటున్నాను. మన పిల్లల్ని పెంచడం మనది బాధ్యత. ఆ విషయం నాకింతవరకూ ఎందుకు తట్టలేదు?" “పెద్ద వదినను కలిసారా?” అనుమానంగా అడిగింది రమ. “పెద్దక్క మాటలు విని ఉంటే నాలుగు నెలల క్రితమే అమ్మను ఊరికి పంపించేవాడిని.” “మరి ఇంత సడన్ గా తమరికి జ్ఞానోదయం ఎలా అయిందో?” వెటకారంగా అంది రమ. “రాత్రి ట్రైన్ లో ఒక అధ్భుతమైన వ్యక్తిని కలిసాను. అప్పుడయింది జ్ఞానోదయం” హుషారుగా చెప్పాడు ప్రసాదు.
“ఎవరో ఆ అద్భుత వ్యక్తి?” ఆ వ్యక్తి గుర్తుకు రాగానే పెదవుల మీదకు ముందు చిఱునవ్వు చేరింది.
నిన్న ఎమైందంటే.....
“లేదు కన్నా! రేపు ఉదయానికంతా ఇంట్లో ఉంటాను కదా” ఆ పెద్దావిడ చెప్తుంది ఫోనులో. అవతల ఎవరో? ఆ మాటలు నమ్ముతున్నట్లు లేదు. “సరే ఇక్కడ
ఒక
అంకుల్
ఉన్నారు.
ఆ
అంకుల్
ని
నువ్వే
అడుగు”
అని
ఫోను
నాకిచ్చింది
ఆమె.
సుమారుగా
మా
అమ్మ
వయసే
ఉంటుంది.
కాని
మా
అమ్మ
కుండా
ఆరోగ్యంగా,
ఆనందంగా,
ఉత్సాహంగా
ఉన్నారు
ఆమె.
“నిజంగా
మా
నాన్నమ్మ
ట్రైనులోనే
ఉన్నారా?”
అపనమ్మకంగా అడుగుతున్నాడు ఆ అబ్బాయి.
“అవును”
అని
రెండుసార్లు
చెప్పాక
నమ్మాడు
ఆ
అబ్బాయి.
ఫోను
పెట్టేసాక
ప్రశ్నార్ధకంగా
చూసాను.
“మూడు
రోజుల
నుండి
వస్తానని
అబద్ధం
చెప్తున్నాను.
అందుకని
నిజమైనా
ఈ
రోజు
నమ్మడం
లేదు.”
“ఎందుకలా
అబద్ధం
చెప్పారు?”
“నిన్న
నా
పెద్ద
మనవడి
పుట్టిన
రోజు.
అది
అయ్యాక
వెళ్ళమని
వాడు
మారాం
చేసాడు.
సరే
నాలుగు
రోజులే
కదా అని
ఉండిపోయాను.” “దానికి అబద్ధం ఎందుకు?” “మొన్న
ఆదివారానికంతా నేను రెండో కొడుకు ఇంట్లో ఉండాలి. పెద్ద మనవడి పుట్టిన రోజు చూసి వస్తానంటే,
ఇప్పుడు ఫోనులో మాట్లాడిన వాడు నా రెండో కొడుకు పెద్ద కొడుకు ఒప్పుకోలేదు. అన్నను ఇక్కడకే
రమ్మను. ఇక్కడే అన్న పుట్టిన రోజు చేద్దాము అన్నాడు. అందుకని ప్రతిరోజూ ఏదో ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది.” “మీ మనవడికి
మీరంటే చాలా ఇష్టం లాగుంది.” “అవును” ఏం గుర్తు వచ్చిందో నవ్వుకుంటూ అంది ఆమె. పడుకోవడానికి
ఇంకా రెండు గంటల టైం ఉంది. ఈవిడను కదిపితే కాలక్షేపం అవుతుంది అని మాట పొడిగించాను.
“మీరెక్కడ ఉంటారు?” “ఒక దగ్గర అని లేదు.” ముఖంలో అదే చిఱునవ్వు. “అదేమిటి?” “మూడున్నర నెలలు పెద్దవాడి దగ్గర, మూడున్నర నెలలు చిన్నవాడి దగ్గర...” “మిగిలిన రోజులు రెండోవాడి దగ్గర” నేనే అందుకుని అన్నాను. ఆమె నవ్వేసి “నాకు కొడుకులు ఇద్దరే” అన్నారు. “మరి మిగిలిన రోజులు?” “కూతురింట్లో.” “కూతురింట్లోనా!” ఆశ్చర్యంగా అన్నాను. “అవును. మా అమ్మాయి పెళ్ళైన వెంటనే అత్తయ్యా ఇక నుండి మీకు ముగ్గురు కొడుకులు అన్నాడు మా అల్లుడు.” లెక్క వేసి “అయితే ఐదు నెలలు కూతురు దగ్గర ఉంటారన్న మాట.” “ఊహూ” తల అడ్డంగా ఊపారావిడ. “అందరి దగ్గరా మూడున్నర నెలలే ఉంటాను.” “మరి మిగిలిన నెలన్నరా!” “నా దగ్గర నేను ఉంటూ నాలోని నన్ను ఆవిష్కరించుకుంటాను.” పాపం! ఆ నెలన్నరా ఆమెను ఎవరూ ఉంచరుకాబోలు. మా అమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మకు ఈ ఇబ్బంది లేదు. మా అమ్మకు ఒక్కడినే కొడుకును. ఎప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను. “మిమ్మల్ని ముగ్గురూ అలా పంచుకుంటే మీకు బాధగా ఉండదా!” నా పరిధి దాటిపోయి అడిగేసాను. “నన్ను కాదు. నా అభిమానాన్ని.” అదే చిఱునవ్వు ఆమెలో. అయినా నాలో ఏదో అనుమానం. ఆమె ఏదో దాస్తుందని. “ఇలా మూడున్నర నెలలు దాటగానే ఇంకొకరి దగ్గరకు వెళ్ళాలంటే బాధగా ఉండదా!” “ఉంటుంది, ఉండదు.” “అదేమిటి?” కళ్ళతోనే అడిగాను. “అన్ని రోజులు ఒకరితో సరదాగా గడిపి విడిచి వెళ్ళాలంటే బాధ. నేనెప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే ఆనందం.” మరి అంత బాగా వాళ్ళు ఆమెను చూసుకుంటే ఆమె ఒక్కరూ ఒంటరిగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? పిల్లలైనా ఆమెను అలా ఎందుకు ఉండనిస్తున్నారు? నాలో అనుమానం ఇంకా వదల లేదు. మరెందుకని నా అనుమానం ఆమె ముందు పెట్టేసాను.
“ఎవరి దగ్గర ఉన్నప్పుడు వారికి అనుగుణంగా ఉండాలి. మా పెద్దవాడు నేవీలో పెద్ద ఆఫీసరు. వాళ్ళదంతా నేవీ కల్చరు. రాత్రి వరకూ పార్టీలు, హడావుడి. పెద్దవాడి దగ్గర ఉన్నప్పుడు వాళ్లతో పాటు క్లబ్బులకు వెళ్ళడం, పార్టీలకు అటెండ్ అవడం..... వాళ్లలాగే ఉండాలి. మా రెండోవాడు బేంకులో ఆఫీసరు. మా కోడలికి భక్తి ఎక్కువ. పూజలూ, పునస్కారాలూ.....ఆమె వేకువనే లేస్తుంది. అందరినీ లేపుతుంది. అక్కడున్నప్పుడు అలాగే ఉండాలి. ఇక కూతురు దగ్గర వియ్యంకురాలు ఉంటుంది. ఆమెతో పాటు షాపింగులకు, గుళ్ళకు... ఆమెకు తోడు అవాలి. ఇక నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోగలను?” ఆమె అంత చెప్పినా నాకు అర్ధం కాలేదు ఆమె విడిగా ఎందుకుండాలో! “నేను పెద్దవాడి దగ్గర ఉన్నప్పుడు తెల్లవారి ఏడుకు లేచే బదులు పొరపాటున ఆరు గంటలకు లేస్తే అదో పెద్ద విషయం అయిపోతుంది. అమ్మకు నిద్ర ఎందుకు పట్టలేదు? ఆరోగ్యం బాగా లేదా! వెంటనే డాక్టరుకు కబురు వెళ్ళిపోతుంది. అందుకని ఉదయం తొందరగా లేవాలని ఉన్నా ఏడు గంటలవరకూ మంచం దిగను. అదే చిన్నవాడి దగ్గర ఒక గంట ఆలస్యంగా లేస్తే ఏమండీ అత్తగారికి ఏమైందో? ఈ రోజు ఇంకా పడుకున్నారు. డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళండి అంటుంది కోడలు. అందుకని ఇంకా పడుకోవాలని ఎప్పుడైనా అనిపించినా గాని ఆరుకే లేచిపోతాను.” ఇక కూతురి దగ్గర ఎలా ఉంటుందో? అసలే వియ్యంకురాలు కూడా ఉంటుంది కదా! నా సంశయం అర్ధమయింది ఆమెకు. నవ్వేసి “అక్కడ కొంచెం నయమే. ఆమెది నా వయసే కదా!నన్ను అర్ధం చేసుకోగలదు. కాని నేనెప్పుడు వస్తానా! నాతో కలిసి గుళ్ళకూ, గోపురాలకూ వెళ్దామా! అని ఆమె ఎదురు చూస్తుంది. అందుకని ఆమెతో పాటు అలా గడుస్తుంది. కాని నాకు నచ్చినట్లు ఉండాలని నాకూ ఉంటుంది కదా! అందుకే ఆ నెలన్నర నా కోసం కేటాయించుకున్నాను. తొందరగా లేవాలనిపిస్తే లేస్తాను. లేదూ ఎనిమిది గంటలవరకూ మంచం మీద దొర్లాలనిపిస్తే అలాగే చేస్తాను. తినాలనిపిస్తే తింటాను.లేకపోతే మానేస్తాను.ఒక్కమాటలో ఒంటరి జీవితాన్ని అనుభూతిస్తాను.అక్కడ అందరికీ నచ్చినట్లు నన్ను నేను మలుచుకుంటాను. ఇక్కడ నాకు నచ్చినట్లు నేను ఉంటాను.” “మరి మీకు ఒంటరిగానే బాగుంటే అలాగే ఉండవచ్చుకదా!” “ముందు అలాగే ఉండేదానిని. కాని నాకు హార్టు ఎటాక్ వచ్చి, ఆపరేషను అయ్యాక నేను ఒంటరిగా ఉండడానికి ముగ్గురూ ఒప్పుకోలేదు.” “మరి అమ్మ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ పంచుకోవడం ఎందుకు?” దానికీ సమాధానం చెప్పింది ఆమె. ఎవరికి వాళ్ళు ఆమె తమ దగ్గరే ఉండాలని పట్టుపడితే ఈ మూడున్నర నెలల ఉపాయం చెప్పిందట ఈవిడ. అందుకని ఒక్క రోజు కూడా ఎవరూ మిస్ అవడానికి ఇష్టపడరట. నాన్నమ్మ ఎప్పుడు వస్తుందా అని పిల్లలు ఎదురుచూస్తారట.
“మరి ఆ నెలన్నర మీరు ఒంటరిగా ఉంటే వాళ్ళకు ఏం అనిపించదా! మీరు ఎలా ఉన్నారో అని.” “ఎందుకనిపించదు? అందుకే మా కజిన్ ఇంటి పక్కనే ఇల్లు తీసారు. వాళ్ళకు నాకు తలుపు అడ్డం. ఆ తలుపుకి గడియ లేదు. ఇక సెల్ ఫోనులు, స్కైపులు ఉండనే ఉన్నాయి.” “మరి మీకు భయంగా ఉండదా! మీ పిల్లలు దగ్గర లేనప్పుడు మీకేదైనా అయితే....” మాట మింగేసాను. “భయమెందుకు. మన జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా....ముగింపు పలకాలో ఆ దేవుడు రాసి పెట్టి ఉంటాడు. అప్పటివరకూ హాయిగా, ఆనందంగా గడపకుండా, ఆ గడియ ఎప్పుడు వస్తుందో అని భయంతో గడపడం ఎందుకు?” ఎదురు ప్రశ్నించింది ఆమె. “అయితే వృద్ధులైన తల్లితండ్రులను ఒంటరిగా విడిచిపెట్టాలంటారా! అదే వాళ్ళు కోరుకుంటారా?” నా మనసులో నలుగుతున్న సందేహాన్ని ఆమె ముందు ఉంచాను. “అలాగని కాదు. అది పరిస్థితులనుబట్టి మారుతుంది. అన్నీ అనుకూలంగా ఉంటే వారి ఇష్టానికి వారిని విడిచిపెట్టడం మంచిది. ఉదాహరణకి ఊడల మానును రక్షించుకోవడానికి దానిని వేరే దగ్గరకు తరలించవచ్చు. అంతేకాని మన సరదాలకోసమో, అవసరాల కోసమో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టును పీకి ఇంకొక దగ్గర నాటాలనుకోవడం లాంటిదే వయసు మళ్ళిన తల్లితండ్రులను వాళ్ళకు అలవాటు అయిన పరిసరాలనుండి దూరం చేసి తమతోపాటు నగరాల్లో ఉండమనడం. వీలుంటే వాళ్ళు ఉన్న దగ్గరే వాళ్ళకు కావలిసిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే సరి. ఇది నా అభిప్రాయం మాత్రమే.” ఆమె అన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఆమె మాట్లాడుతున్నంతసేపూ మా అమ్మ నాకు గుర్తుకొస్తూనే ఉంది. నా స్వార్ధం కోసం, నా కుటుంబం సుఖం కోసం అమ్మకు ఇష్టం లేకుండా నా దగ్గరకు తీసుకు వచ్చాననే విషయం ఇప్పుడు బాగా అర్ధమయింది. అమ్మను వెంటనే ఊరు పంపించెయ్యాలి. నాలుగు రోజులు సెలవు పెట్టి అమ్మకు కావలిసిన ఏర్పాట్లు మా ఊరిలో చేయాలి. అప్పుడే నిర్ణయించుకున్నాను.
- - Dr.M.Bharathi
Asso. Professor
Dept. of Microbiology
RIMS, Kadapa
Comments
Post a Comment