Telugu story-అనురాగాలు- అనుబంధాలు (published in Telugu velugu)

                                                 అనురాగాలు- అనుబంధాలు

       సర్జికల్ గౌనులో ఆపరేషన్ ధియేటర్ లోకి వెళ్తున్న భార్యను చూసి కంట తడి పెట్టాడు రమణమూర్తి. భగవంతుడా! ఏమీ కోరను. నా భార్యను మాత్రం నాకు దక్కించు అని మనసులోనే వేడుకుంటున్నాడు ఆ దేవున్ని.  సంధ్య తన జీవితం లోకి రాకుండా ఉండేటట్లైతే తను ఎలా ఉండేవాడు? అందరిలాగే నెలాఖర్లో ఏ,ఏ,లోన్లు పెట్టుకోవచ్చో  అని లెక్కలు వేసుకుంటుండేవాడేమో! సంధ్యతో మొదటసారి ఎప్పుడు మాట్లాడాడు? పెళ్ళిచూపుల్లోనా ! కాదు. ఆఫీసులో అటెండరు వచ్చి "సార్! మీకొసం ఎవరో వచ్చారు" అంటే వెళ్ళి చూస్తే సంధ్య.          రెండు రోజుల క్రితం పెళ్ళి చూపుళ్ళో  కలిసిన  అమ్మాయి. ఇంటెర్ ఫస్ట్  క్లాసులొ  పాసైనా  ఇంకా చదివించే స్థోమత   లేక చదువు ఆపించారు తల్లిదండ్రులు.  మూడు లక్షల కట్నం, పాతిక వేలు ఆడపడుచు కట్నం వాళ్ళిస్తామనీ, ఐదు తులాల బంగారం మేమిచ్చేటట్లు  పెద్దమనుషులు ఒప్పందం చేసారు.  అమ్మ మాత్రం ఇంకో లక్ష కట్నం అడుగుతుంది. ఇప్పుడీ అమ్మాయి   ఎందుకొచ్చినట్లు?  సూటిగా తాను ఎందుకొచ్చిందో చెప్పేసింది. బంగారం కొనడానికి సగము కట్నం పోగా మిగతాది పెళ్ళి ఖర్చులకు   కరిగిపోతుంది.  అంటే మేమిచ్చిన  కట్నం డబ్బు మీకేమీ మిగలదు. ఇక పోతే మా నాన్న ఆ డబ్బు కోసం అప్పు చేయాలి.      మా నాన్న అప్పు చేసిన డబ్బు తో నేను నగలు ధరించాలనుకుంటానా!   మీరే ఆలోచించండి. అని తన సూచన చెప్పకనే చెప్పింది. తాము బంగారము పెట్టకపోతే ఆ లక్షన్నర ఆమె తండ్రికి మిగులుతుందని తెలివిగా సూచించింది. పెళ్ళి కూడా సింపుల్ గా  ఏ గుడిలోనో చేసుకుంటే  ఆ డబ్బైనా మిగులుతుంది అంది. 

తన ఇంటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు  రమణ మూర్తి.  తండ్రి చనిపోతే వచ్చిన గుమస్తా ఉద్యోగము. ఒక తమ్ముడు, ఒక చెల్లి.  తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు. చదువు మీద పెద్దగా శ్రధ్ధ లేదు. చదవడానికి బద్దకమేసి, ఇంటర్ ఫెయిల్ అయి, కలల్లో తేలిపోయే నవలలు చదువుతూ చెల్లి. ఏ రాజకుమారుడో  తనను వరించడానికి వస్తాడని ఎదురుచూస్తుంది. మధ్య  తరగతి భేషజాలకు ప్రతీక అమ్మ. దాంతో నెల తిరక్కుండానే చేబదుళ్ళకు పరిగెట్టాల్సి   వస్తుంది. ఇప్పుడే ఇలాగుంటే, రేపు పెళ్ళయ్యాక పిల్లలు పుడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందాన తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆ అమ్మాయి  చెప్పినట్లు  చేస్తే...ఇంట్లో తుఫాన్ రేగుతుంది. ఏమీ లేనివాళ్ళల్లా గుళ్ళో పెళ్ళా! నేనొప్పుకోను అని యుధ్ధం మొదలౌతుంది. తట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్తు అప్పులమయం అయిపోతుంది. సో! ఆ అమ్మాయి చెప్పినట్లు మేము బంగారం పెట్టము.  మీరు సగం కట్నం ఇస్తే చాలు అని చెప్పితే, సగం అప్పు వాళ్ళ నాన్నకు తగ్గుతుంది. కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటాను అనే ధైర్యం చెయ్యలేడు గాని ఈ మాత్రం సాయం చెయ్యగలడు.

ఇలాగని చెపితే ఇంట్లో ఎంత గొడవ అయింది? అన్నిటికీ తట్టుకుని నిలబడ్డాడు. అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందో తనకే తెలియదు. ఆమె మాటకు విలువ ఇచ్చానని తనంటే ఎంత ఆరాధనో ఇప్పటికి కూడా! తన మామగారు ఎంత గౌరవిస్తారు తనని? ఆయన భారం కొంతైనా తగ్గించానని? కన్నీళ్ళు జల, జలా కారిపోతున్నయి ఆమె తలపులతో. 

                       --------------------------------------------------------------           

 శాంతమ్మగారికి కోడల్ని అలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. దుఃఖం ఆగడం లేదు. తను బయట పడిపోతే కొడుకు ఇంకా బెంబేలెత్తిపోతాడని నిగ్రహించుకుంటుంది. సంధ్య తనకి కోడలా!  కాదు. కూతురు కుండా ఎక్కువ. ఏ రోజు తన ఇంట  అడుగు పెట్టిందో, తన ఇంటిని స్వర్గధామం చేసింది. మొదట్లో, సగం కట్నం తీసుకుని, గుళ్ళో పెళ్ళి చేసుకున్న కొడుకుని ఏం అనలేక, ఆ అక్కసును కోడలి మీద చూపించేది. పనులు అన్నీ మౌనం గానే చేసుకుపోతున్నా ఏదో వంకతో సాధించేది. అన్నీ చిరునవ్వుతో భరించి, తను ఊహించని ఎత్తుకు తన కుటుంబాన్ని చేర్చింది. తన కొడుకు గుమస్తా అయితేనే తను పెద్ద మహరాణిలా  పెత్తనం చెలాయించేది . అలాంటిది ఒక కొడుకు కాదు తన ఇద్దరు కొడుకులూ పెద్ద ఆఫీసర్లు అయ్యారంటే... కోడలి చలవే కదా! ఆఫీసర్ అల్లున్ని తెచ్చింది. ఇప్పుడు అల్లుడు, కూతురు అమెరికాలో ఉన్నారు. తనెంత పుణ్యం చేసుకుందో! ఇలాంటి కోడలు రావడానికి. ఆ అదృష్టాన్ని  నాకు దూరం చెయ్యకు దేవుడా అని ఎన్ని మొక్కులు మొక్కుకుందో! ఏ దేవుడన్న  తన మొర ఆలకించకపోడా అన్న ధైర్యం. ఇంకో పక్క భయం.....దేవుడు మంచివాళ్ళనే తీసుకుపోతాడేమోనని..... 

        సంధ్య కన్నా మంచి పిల్ల ఎవరుంటారు? అసలు ఈ ఏక్సిడెంట్ ఎలా అయింది. ఒక చిన్న  పాపను రక్షించబోయి తను కారు క్రింద పడిపోయినందుక్కాదా! తమ పిల్లను కాపాడిన దేవతకు ఏం కాకూడదని ఆ దంపతులు ఎన్ని ప్రార్ధనలు చేస్తున్నారో! తమకు ధైర్యం చెపుతూ అప్పట్నిండి ఇక్కడే ఉన్నారు. ఐ.సి.యు.లోకి ఎవరినీ వెళ్ళనివ్వకపోయినా ఎంతమంది జనం....విషయం తెలిసి అలా వస్తూనే  ఉన్నారు.  ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదుకుందో! మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. ఛాన్స్ ఫిఫ్టి, ఫిఫ్టి అన్నారు.అప్పుడే ఓ.టి. లోకి వెళ్ళి  రెండు గంటలైంది. ఎవరూ బయటకు రావడం లేదు.  తమ కుటుంబంతో పాటు ఎంతమంది ఎదురు  చూస్తున్నారో! ఆపరేషన్ బాగా అయింది. మరేం ఫరవాలేదు అన్న డాక్టర్ల మాటకోసం.     

                         ------------------------------------------------------------------------

  యేమండీ సంధ్యక్కకు ఏక్సిడెంట్ అయిందట, మనము అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి అని భార్య స్వాతి చెప్పగానే భానుమూర్తికి ఊపిరి ఆగిపోయినట్లైంది. అతని పరిస్థితి చూసి స్వాతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి హైదరాబాద్  తీసుకువచ్చింది. చైతన్యం మూర్తీభవించినట్లుండే వదిన, ప్రశాంతతకు మారు పేరులా, నిండు కుండలా ఉండే వదిన... అచేతనంగా అలా బెడ్ మీద… రకరకాల ట్యూబులు  చుట్టూ... చూడలేకపోతున్నడు భానుమూర్తి.   అసలు తనకు వదినకు అనుబంధం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఆమె తమ ఇంట్లో అడుగు పెట్టిన రోజా? ఉహూ!..ఏదో అన్నయ్య భార్య.. . ఏదో కాస్త చదివింది...  గొప్ప ఉన్నవాళ్ళేమీ కాదు.. ఇంతే ఆమె  మీద తన అభిప్రాయం. ఆ అభిప్రాయం ఎప్పుడు మారింది? అప్పట్లో తను డిగ్రీ చదివేవాడు.  కాళ్ళు భూమ్మీద నిలిచేవి కాదు.    అన్నయ్య కాబట్టి గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు గాని నేనైతే ఆఫీసర్ కన్న తక్కువ ఉద్యోగంలో చేరనని  ఫోజులు కొట్టేవాడు. తన మార్కులకు కనీసం బంట్రోతు ఉద్యోగం వచ్చినా గొప్పేనని అప్పట్లో తెలియదు.అమ్మాయిలను ఏడిపించడం.. ఊరిమీద తిరగడం..ఇదే పని.  గాని కొత్తగా వచ్చిన ఎస్సైకి ఇవేవీ నచ్చలేదు. ఈవ్ టీజింగ్ కింద బుక్ చేసి చితగ్గొట్టాడు. చితగ్గొట్టినా ఫరవాలేదు గాని పెద్దవాళ్ళు వస్తే గాని విడిచిపెట్టనన్నాడు ఎంత బతిమిలాడినా. అప్పుడు వచ్చింది వదిన. బయటకు వచ్చాక "వదినా నేనేం చెయ్యలేదు. అందరితోపాటు నన్నూ లోపల వేసేశారు" అని ఏదో చెప్పబోతుంటే "నేనా బస్సులోనే ఉన్నాను” అంది. అంటే అంతా చూసిందన్నమాట. ఇప్పుడీ విషయం ఇంట్లో తెలిస్తే తను తలెత్తుకోగలడా! ఇంట్లో తిరగ్గలడా! తమ వీధి మలుపు రాగానే "నేనేం చూడలేదు. నీకు ఏక్సిడెంట్ అయినట్లుంది" అని గబ, గబా వెళ్ళిపోయింది. అయినా  తనకు భయమే. ఎప్పుడైనా, ఎవరితోనైనా,ఆఖరికి అన్నయ్యతోనైనా చెప్పేస్తుందని. కాని ఎవరూ లేని సమయం చూసుకుని  ఒక్క మాటే  చెప్పింది నా జీవితం మారిపోయేలా. ఏమిటా  మాట? “నువ్వు అమ్మాయిల వెంట ఎందుకు పడాలి? వాళ్ళే నీ వెంట పడేటట్లు చేసుకోవచ్చు కదా” అని. ఆస్తా! అందమా! ఏముందని పడతారు. నా మనసులో మాట చదివిన్నట్లు “నువ్వు  బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుంటే” అంది. అని ఊరుకోలేదు. నాతోపాటు తనూ చదివేది. డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ వచ్చాక తనలో ఆత్మ  విశ్వాసం పెరిగింది. కాంపెటిటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసాడు. ఈలోగా వదిన ప్రోత్సాహంతో అన్నయ్య కాంపెటిటివ్ పరీక్షల్లో సెలెక్ట్ అయి మంచి పోస్ట్ లోకి వచ్చాడు. ఇంట్లో చాలా సమస్యలు తీరాయి.    ఇళ్ళు కళకళ్ళాడింది.

తనతో పాటు సరదాగా చదివే వదినను బలవంత పెట్టి అప్లికేషన్ లు పెట్టించేవాడు. “నాకెందుకయ్యా! ఇద్దరూ ఉద్యోగం చేస్తే పిల్లలను ఎవరు చూసుకుంటారు?  భార్యా భర్తల్లో ఒక్కరికే  ఉద్యోగం ఉంటే నిరుద్యోగ సమస్య కొంతన్నా తీరుతుంది” అనేది. అలా సరదాగా రాసినా ఒకసారి తనకే ఎక్కువ మార్కులు వచ్చి మంచి రేంక్ తెచ్చుకుంది.ఇరవై పోస్ట్ లకుగాను తను ఇరవై ఒకటోవాడు. వదిన తప్పుకుంటే ఆ పోస్ట్ తనకే. కాని     అలాగని వదినా ఉద్యోగం నాకు వదిలేయండి అనలేడు. ఆమె కౌన్సిలింగ్ కు వెళ్ళదు తనకు ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాడు. తీరా కౌన్సిలింగ్ రోజు తన కుండా ముందే వెళ్ళిపోయింది. కౌన్సిలింగ్ లో వదినను చూసిన తను మాట్లాడకుండా  వెనక్కి వచ్చేసాడు. మాటలు వేరు చేతలు వేరు అని తేలిపోయింది. కాని నెల పోయాక ఏమైంది? వదిన జోయిన్ అవకపోతే నెక్స్ట్ రేంక్ వాడు తనని           పిలిచి ఉద్యోగం తనకిచ్చారు. మాత్రం దానికి కౌన్సిలింగ్ కి వెళ్ళి తననెందుకు ఒక నెల ఇబ్బంది పెట్టడం? ఇంకా అర్ధం కాలేదా? లాస్ట్  నెంబరుగా ఇంటర్వ్యూకి నేవెళ్ళుంటే కావాల్సిన దగ్గరకు పోస్టింగ్  రాదు. అలాంటి మా వదిన  ఈరోజు ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే నాకు అంతా శూన్యం లా ఉంది. నేనే ఇలా ఉంటే అన్నయ్య పరిస్థితి ఊహించడానికి భయం వేస్తుంది. దేవుడా మా వదినను మాకిచ్చెయ్.  

                       --------------------------------------------------------------------------------------

     తనను స్వంత చెల్లెలికన్నా ఎక్కువగా చూసుకొనే  సంధ్యక్క అలా మాటా పలుకూ లేకుండా ఉంటే ఏడుపు ఆగడము లేదు స్వాతికి. మొదటిసారి సంధ్యను పెళ్ళి చూపులకు తమ ఇంటికి వచ్చినపుడు చూసింది. ఇంటికి పెద్ద కోడలు అని ఏమీ భేషజాలకు  పోకుండా అరమరికలు లేకుండా తనతో మాట్లాడింది.  ఆ రెండో రోజు భానుమూర్తి వచ్చి తన అమ్మానాన్నల సమక్షం లో తనతో చెప్పిన  మాటలు ఎప్పటికీ మర్చిపోదు. " వదిన తల్లి తర్వాత తల్లి అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు మా వదిన తల్లి కుండా ఎక్కువ. నా చదువు, నా ఉద్యోగం ఆమె పెట్టిన భిక్షే.  భవిష్యత్తులో నా కుటుంబం నుండి ఏ రకముగానైనా ఆమె గౌరవానికి భంగం కలిగితే నేను  సహించను. నా కుటుంబాన్ని వదులుకోవడానికైనా సిధ్ధపడతాను గాని, ఆమెకు ఏ రకం గానైనా చిన్న బాధ కలిగినా సహించను"  అని. అన్యాపదేశంగా తనను హెచ్చరించాడు, ఆమెతో ఏ విషయంలోనైనా  పోటీ పడకూడదని. అదే జరిగితే నువ్వే బయటకు వెళతావు అని.  ఆ రోజు తనెంత ఈర్ష్య పడింది సంధ్యను తలచుకుని. 

     పెళ్ళయ్యాక సంధ్యతో పోటీ పడాల్సిన అవసరం రాలేదు. కాదు సంధ్య రానివ్వలేదు. కొత్తలో ఆడపడుచు రాణి దేనికైనా పెద్ద వదిన లాగ చిన్న  వదిన లేదు అని, అనీ అనకముందే “ఇంకా కొత్త కదా! తనకీ అడ్జెస్ట్  అవాలంటే టైం పడుతుంది కదా! మొదట్లో నేను అలాగే ఉండేదాన్నేమో  కదా!” అంటే కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని రాణి అన్న మాటలు కూడా మరపుకు రావు "వదినా!  మొదట్లో ఆడపడుచుని అన్న అహంకారం తో నేను మిమ్మల్ని చాలా అన్నాను. ఆ మాటలకు ఇప్పటికీ సిగ్గు పడుతున్నాను. క్షమించు వదినా" అని. ఆడపడుచునే అంత ప్రేమగా చూసుకునే ఆమెకు తోడికోడలితో ఏ రకమైన భేదాలు ఉంటాయి? ఇంకా రాణికి ఈ విషయం తెలియదు.దూరాన ఉందని చెప్పలేదు. ఎంతమందిలోనైనా ఎన్నిక  చేయగలిగిన వ్యక్తిత్వం ఆమెది. తను ఎక్కడ  ఉంటే అక్కడ సందడే. ఏ పూర్వ జన్మ బంధమో తమది. అలాంటి అక్క ఎవరితోనూ సంబంధం లేనట్టు   అలా ఉంటుంటే .... స్వాతికి తెరలు, తెరలుగా దుఃఖం వస్తుంది.దేవుడా మా అక్కను మా బావగారినుండి దూరం చెయ్యకు. ఆ దంపతులకు ఎడబాటు  కలిగించకు అని మనసులోనే దేవున్ని వేడుకుంటుంది.

                      -------------------------------------------------------------

       రెండు గంటలు ఐదు గంటలయ్యాయి. అందరికీ లోపల్లోపల టెన్షన్. ఆపరేషన్ థియేటర్ లో నుండి ఎవరూ బయటకు రావడం లేదు. ఏమిటీ ఆపరేషన్ సరిగ్గా అవలేదా! ఇంతసేపు ఎందుకు పట్టింది? రక రకాల ఆలోచనలు అందరిలో. ఆపరేషన్ థియేటర్  తలుపు తెరిచిన  శబ్దం అవగానే ఒక్క ఉదుటున అందరూ తలుపు దగ్గరికి చేరారు. వరమిచ్చే దేవుడిలా డాక్టరు గారు రానే వచ్చారు. అందరి మనసులు చల్లబడేలా "ఆపరేషన్"  సక్సెస్ అనే మాట చెప్పారు.

                                                                                                                  - డా.భారతి

 

 


Comments

Popular posts from this blog

Sri lanka Tour from 4-1-2019 to 12-1-2019

Puri, Bhuvaneswar Tour (పూరీ, భువనేశ్వర్ యాత్రా విశేషాలు) 7-11-19 To 10-11-19

Nepal Tour (నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర) 9-4-18 to 24-4-18