నాటి అందాల విశాఖ - నేటి గాయాల విశాఖ
నాటి అందాల విశాఖ - నేటి గాయాల విశాఖ
అందాల హరిత విశాఖ
మారింది కదనరంగంలా
హుధూద్ విలయ తాండవంతో
పచ్చని వృక్షాలు ప్రచండ గాలుల్లో
ఊగి,ఊగి, నిలబడటానికి తుదిదాకా పోరాడి
నేలకొరిగిపోయాయి అలసి, సొలసి
సంవత్సరాలుగా పెంచుకున్న పచ్చదనం
ఒక్కరోజులోనే అయింది నేలమట్టం
గాలితాకిడిని ఆపలేక
ఆకాశంలో ఎగిరాయి రేకుల పైకప్పులు
నిలదొక్కుకోలేక కూలాయి విద్యుత్ స్తంభాలు
ఎగసి, ఎగసి సముద్రపు అలలు
తీరం సరిహద్దు దాటి
ముంచెత్తాయి రహదారులను, ఇళ్ళను
కుండపోతగా కురిసిన వాన
స్తంభింపచేసింది జన జీవనాన్ని
ఉన్నతంగా కనిపించే విమానాశ్రయం
ఇప్పుడు కనిపిస్తుంది ఇనుప ఊచల కళేబరంలా
పచ్చదనంతో అలరారే ఆంధ్ర విశ్వవిద్యాలయం
మిగిలింది రాతి కట్టడాల మోడులా
విశాఖవాసులకు ఆహ్లాదాన్నందించే కైలాసగిరి
మిగిలింది కాలిపోయిన అరణ్యంలా
పశు పక్ష్యాదులతో అందరిని అలరించే జూపార్కు
తలపిస్తుంది మరుభూమిని
నిన్న అందాల విశాఖ
నేడు..చిందర వందరైన విశాఖ
మచ్చుకైనా కానరాని పచ్చదనం
నేలరాలిన హర్మ్యాల అందాలు
రూపు మారిన సుందర భవనాలు
కకావికలమైన నూతన భవంతులు
ఇంతటి (ఎంతటి) విపత్తులో కూడా
మేము అండగా ఉంటామని, ఉన్నామని
ధృడంగా నిలబడ్డ పురాతన కట్టడాలు
ఎటు చూసినా విరిగిపడిన కొమ్మలు, రెమ్మలు
మొదలంటా కూలిన చెట్లు
లేకపోతే, ఆకైనా లేక మిగిలిన, మిగిలిన చెట్లు
నేలకూలిన విద్యుత్ స్తంభాలు
తెగిపడిన విద్యుత్ తీగలు
ముక్కలు, ముక్కలైన అద్దాలు, సిమెంట్ స్లాబ్ లు
ఒక విమానాశ్రయమా! విశ్వ విద్యాలయమా!
ఆసుపత్రా! ఇది అదని లేదు
అన్నీ మిగిలాయి,
ప్రకృతి ప్రకోపానికి ఆనవాళ్ళుగా
ఎంత ఎదిగినా మానవ మేధస్సు
ప్రకృతి ముందు ఓ చిన్న రేణువే
అన్న నిజానికి సాక్షీభూతులుగా
- డా.భారతి
Comments
Post a Comment