తల్లిమనసు
తల్లిమనసు
ఏమండీ! అమ్మాయికి తొందరపడి పెళ్ళి చేసామంటారా? పార్వతి ఇప్పటికి ఈ మాట అడగడం ఎన్నోసారో! రామారావు ఏం బదులు చెప్పలేదు. ఇరవై నాలుగేళ్ళు నిండిన అమ్మాయికి పెళ్ళి చేసి వారము రోజులైంది. నిన్నటి వరకూ చుట్టాలతో సందడిగా ఉన్న ఇల్లు నిన్న అమ్మాయిని అత్తవారింటికి దిగబెట్టి వచ్చేసరికి బోసిపోయింది. ఇంజినీరింగు చదువుతున్న కొడుకు అటునుండి అటే కాలేజ్ కు వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది తామిద్దరే.మరో రెండేళ్ళు ఆగి పెళ్ళి చేయాల్సిందండి! ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అవలేదు. మంచి సంబంధం అని పెళ్ళి చేసేసారు. పిల్ల అక్కడ ఎలా ఉందో! వాళ్ళ అత్తగారు బాగా చూసుకుంటున్నారో! లేదో! సరిగ్గా తింటుందో, లేదో! అసలే మెతక మనిషి. ఇక్కడే నోరు తెరిచి ఏమీ అడిగేది కాదు. పదిసార్లు పిలవాల్సి వచ్చేది భోజనానికి రమ్మని. అక్కడ ఎవరు పిలుస్తారు అన్ని సార్లు. వేళకు తింటుందో, లేదో?
ఏమండీ రేపు మనము ఓసారి అక్కడకు వెళ్ళి వద్దామా? వద్దులెండి. నిన్నే అక్కడ నుండి వచ్చామా! అప్పుడే వెళితే బాగుంటుందో ! బాగుండదో! అవునండీ! హాస్టల్ లో కొత్తగా చేరిన పిల్లలకుహోం సిక్ సెలవులు ఇచ్చినట్లు పెళ్ళైన ఆడపిల్లలకు కూడా ఓ పది రోజులు సెలవులు అని పుట్టింటికి పంపిస్తే ఎంత బాగుంటుందండి? ఆషాడం ముందు నెలన్నా పెళ్ళి చేసాము కాదు. మంచి ముహూర్తం అని శ్రావణ మాసంలో చేసాముపెళ్ళి. ఇంకో సంవత్సరానికి గానీ ఆషాడం రాదు. మీరెప్పుడూ ఇంతే! ఏదీ ఆలోచించి చెయ్యరు. అసలు మీకేమీ అనిపించడం లేదా? పిల్లను అలాగ వాళ్ళింట్లో వదిలేసి వస్తుంటే? నాకైతే కాళ్ళూ, చేతులూ రాలేదు. అందరూ నవ్వుతారు అని బిగబట్టుకున్నాను గానీ! అప్పటికీ వియ్యంకురాలి తోటికోడలు “పిల్లను వదలలేకపోతున్నట్లు ఉన్నారు వదిన గారు. పోనీ మీరూ ఓ వారము రోజులు ఉండిపోండి అమ్మాయితో పాటు” అని హాస్యమాడింది.
ఆడపిల్లను కంటే తెలిసేది నామనసేమిటో! లింగు, లింగుమని ఇద్దరినీ మగపిల్లలనే కంది.” “ఏమండీ అమ్మాయి కళ్ళముందే ఉందండి! అక్కడేమి అవస్థలు పడుతుందో! ఇక్కడ ఏ పనీ చేసి ఎరుగదు. అక్కడ ఏమి పనులు చెప్తున్నారో? ఏమిటో? దానితో వంట కూడా చేయిస్తున్నారో! ఏమిటో! ఇక్కడ పాలు కాచమంటేనే మీద వొలకబోసుకుంది. అక్కడ ఏం చేస్తుందో! ఆయింట్మెంట్ అయినా ఉందో! లేదో! అయ్యో! అన్నీ ఇస్తాము కానీ, ఆయింట్మెంటులు అవీ ఇవ్వము. చేతులు కాల్చుకుని ఎంత బాధ పడుతుందో ఏమిటో? పిచ్చితల్లి. ఏమండీ అల్లుడు
ఫరవాలేదంటారా? అమ్మాయి మనసు తెలుసుకుని మసలుకుంటాడంటారా? ఇక్కడ ఉన్నప్పుడే అమ్మాయినివదిలేవాడు కాదు. అక్కడేమి చేస్తున్నాడో! ఏమండీ ఒక వేళ..."
"ఆ ఒక వేళ..."
"అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా .......అమ్మో పిల్ల ఎంత నలిగిపోతుందో? ఏమండీ ఆడదాన్ని! ఏదో పిల్ల పెళ్ళి చేసేద్దాము అన్నాను కదా అని వెంటనే సంబంధం చూసి చేసేయడమేనా? ఇన్ని కష్టాలుంటాయి కొన్నాళ్ళు ఆగుదాము అని చెప్పొచ్చుకదా! ఆ పక్కింటి కృష్ణవేణికి ఇంకా పెళ్ళి కాలేదని అంటున్నారు అందరూ. గానీ వాళ్ళ అమ్మ ఎంత అదృష్టవంతురాలో... నాలాగ అప్పుడే బాధ పడక్కరలేదు. ఏమిటండీ! మీకు చీమ కుట్టినట్లుకూడా లేదు. ఇంత వాగుతున్నానా! ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎంతైనా మగవాడిననిపించుకున్నారు. మీరు పాషాణమండీ! ఇరవై నాలుగేళ్ళు గుండెల్లో పెట్టుకుని, ఇప్పుడు ఎవరికో ముక్కూ, ముఖం తెలియనివాడికి ధారపోసి ఎలా ఉండగలుగుతున్నారండీ! మీకేం అనిపించట్లేదా! అయ్యో నా పిల్ల అక్కడ ఎవరింట్లోనో ఉంది అని.”
మాటాడుతుందే కాని పార్వతికి జల, జలా నీళ్ళు కారిపోతున్నాయి కళ్ళనుండి. తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఆమె.
“పార్వతీ! నువ్వో విషయం మర్చిపోతున్నావు. అంతకుండా చిన్న వయసులోనే నువ్వీ ఇంటికి వచ్చావు. ఇక్కడ నువ్వు బాగానే ఉండేదానివి కదా! మన అమ్మాయి అయినా అక్కడ అలాగే ఉంటుంది.”
“అప్పుడు రోజులు వేరండి.”
“రోజులు ఎప్పుడూ ఒకటే పార్వతీ!”
రోజులు ఎప్పుడూ ఒకటేనా! అంటే ఇప్పుడు నాలాగే అప్పుడు మా అమ్మ కూడా...! అయ్యో! తనకెందుకు ఎప్పుడూ తోచలేదు అమ్మ కూడా ఇలాగే ఆలోచించి ఉంటుందని! తన పెళ్ళైన కొత్తలో అమ్మ ఎప్పుడూ తనని ఇంటికి రమ్మనేది. తనేమో ఈయనను విడిచి వెళ్ళాల్సి వస్తుందని ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళేదికాదు. ఈయనకు సెలవు దొరికితేనే వెళ్ళేవాళ్ళు.అక్కడకు వెళ్ళినా అబ్బా మా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇక్కడకు రావడానికి తొందరపడడమే! తన అమ్మ కూడా తనలాగే, కూతురు కష్టపడిపోతుందేమో! అబ్బాయి అమ్మాయిని పువ్వులా చూసుకుంటున్నాడో లేదో అని బెంబేలు పడిపోయి ఉంటుందా! ఇప్పుడు తన కూతురు పెళ్ళి అయ్యాక గాని తన అమ్మ ఎలా ఆలోచించి ఉంటుందో తనకెందుకు ఇన్నాళ్ళూ తట్టలేదు. ఇక్కడ నాలుగు రోజులుండి వెళ్ళవే! అక్కడ నీకు అస్సలు రెస్ట్ ఉండడములేదు అని అమ్మ ఎన్నిసార్లు అని ఉంటుందో! తనేనాడు పట్టించుకోలేదు. ఎప్పుడూ పండగలకు, పబ్బాలకూ, పురుళ్ళకూ, పుణ్యాలకూ తప్పించి
తనేనాడూ తన తల్లితో వీళ్ళందరూ లేకుండా ఒంటరిగా గడపలేదు. నా ఇల్లు, నా పిల్లలు, మా ఆయన అన్నమాటే.
ఇప్పుడు తన కూతురు కూడా అలాగే ఆలోచిస్తుందా! పెళ్ళయ్యాక తన భర్తతో కలిసిన జీవితాన్నే తను పట్టించుకునేది. తన కూతురు కూడా అల్లుడిని అలాగే అనుకుంటుంది కదా! తన అల్లుడు కూతురిని తన నుండి లాగేసుకున్నాడు అని తనకు అనిపించినట్లే అమ్మకు కూడా అనిపించి ఉంటుంది. తనేనాడూ అమ్మ భయాలను అర్ధం చేసుకోలేదు. ఇప్పుడు అర్ధం అయ్యాక కూడా .. . .
“ఏమండీ నేను ఓ నాలుగు రోజులు మా అమ్మ దగ్గరకు వెళతాను. ఆ తరువాత అమ్మాయి దగ్గరకు వెళతాను.”
రామారావుతో చెప్పింది పార్వతి.
-Dr.M.Bharathi
Comments
Post a Comment